Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారు తీరుపై విద్యావేత్తలు, నిపుణులు ఆగ్రహం
- ఫీజుల పెంపుతో స్టూడెంట్స్ నుంచి పిండుడే
- ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ స్టూడెంట్స్‌కు ఇబ్బందులు
మోడీ పాలనలో దేశంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. సరిపడ సిబ్బంది లేక ఇప్పటికే కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా.. స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోతున్నారు. వారు చదువుపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులకు తోడు సదరు విద్యాసంస్థలు వివిధ అవసరాల కోసం తీసుకునే రుణాలు కూడా అందులో చదువుకునే విద్యార్థుల మెడకే చుట్టుకుంటున్నాయి. ఈ రుణాలను తీర్చడానికే విద్యాసంస్థలు ఫీజులను పెంచుతున్నాయి. దీంతో రుణభారం ఫీజుల రూపంలో విద్యార్థుల పైనే పడుతున్నదని విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెచ్ఈఎఫ్ఏ) 2017లో కొత్తగా ఏర్పాటు చేశారు. కెనరా బ్యాంకు, విద్యా మంత్రిత్వ శాఖ జాయింట్ వెంచర్ ఇది. ఇందులో కెనరా బ్యాంకు వాటా 90.91 శాతం కాగా.. విద్యా మంత్రిత్వ శాఖది 9.09శాతంగా ఉన్నది. అదే ఏడాది దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబే హెచ్ఈఎఫ్ఏ నుంచి రూ. 520 కోట్లను రుణంగా తీసుకున్నది. అయితే, సదరు విద్యాసంస్థ విద్యార్థుల చదువులకు, హాస్టళ్లకు అయ్యే ఫీజులను భారీగా పెంచింది. ఉదాహరణకు.. ఎంటెక్ కోర్సు ఫీజులను (హాస్టల్ మరియు ఇతర ఫీజులు) సెమిస్టర్‌కు రూ. 19 వేల నుంచి రూ. 26,450 కి పెంచింది. ఈ పెరుగుదల దాదాపు 40 శాతం. అలాగే, రాబోయే ఎంటెక్ విద్యార్థుల ఫీజులనురూ. 32,450కి పెంచింది. ఈ పెరుగుదల ఏకంగా 70 శాతంగా ఉన్నది. అదే విధంగా పీహెచ్డీ రెండో సంవత్సరం విద్యార్థుల సెమిస్టర్ ఫీజును రూ. 16,500 నుంచి రూ.23,950కి పెంచింది. ఈ పెరుగుదల 40 శాతం కంటే ఎక్కువే.. పీహెచ్డీ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫీజును 60 శాతం కంటే పైకి పెంచడం గమనార్హం. అయితే, ఫీజుల పెంపుపై యాజమాన్యం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో అది కాస్తా, నిరసనలు ఆందోళనలకు దారి తీసింది. పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా గతేడాది జులైలో విద్యార్థులు ఐఐటీ బాంబేలో నిరసనలకు దిగారు. ఫీజులు తగ్గించాలంటూ ఉత్తరాలు రాశారు. ప్లకార్డులు, ర్యాలీలతో క్యాంపస్‌ను హౌరెత్తించారు. ఫీజుల పెంపుపై యాజమాన్యం తీరు గురించి సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం చేశారు. పెంచిన ఫీజులను విద్యాసంస్థ వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే, విద్యార్థుల నిరసనలకు స్పందించామని చెప్పుకోవడానికి యాజమాన్యం ఆగస్టు మొదటి వారంలో కేవలం మెస్ ఫీజులను తగ్గించింది. అయితే, ఈ మెస్ ఫీజుల తగ్గింపుతో తమకు ఒరిగేది ఏమీ ఉండదనీ, పెంచిన సెమిస్టర్, ఇతర ఫీజులను తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సంస్థ యాజమాన్యం ఫీజులను పెంచే నిర్ణయం ఏమాత్రమూ సరికాదని, ఇది తమ లాంటి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, హెచ్ఈఎఫ్ఏ ఏర్పాటే సరికాదని కొందరు విద్యావేత్తలు, నిపుణులు వాదించారు. దీని ఏర్పాటుతో కేంద్రం విద్యాసంస్థల కార్యకలాపాల్లోకి చొరబడేయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఇందుకు ఐఐటీ బాంబేనే ఒక ఉదాహరణ అంటూ వారు తెలిపారు. దేశంలోని పలు ప్రతిష్టాత్మక ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ విద్యాసంస్థలకు వచ్చేవారిలో అధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనబడిన వర్గాల విద్యార్థులే ఉంటారనీ, యూనివర్సిటీల రుణాల భారం వారిపైనే పడుతున్నదని విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రలోని మోడీ సర్కారు ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకొని, విద్యార్థులపై భారం పడకుండా చూడాలని వారు కోరుతున్నారు.