Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాషాయ పార్టీ చర్యలు : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : దేశంలో 2024 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ మత విభజన రాజకీయాలకు పదును పెడుతున్నదని సీపీఐ(ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి ఆరోపించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రామ నవమి వేడుకల్లో భాగంగా పలు వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పారు. '' 2024 (లోక్సభ ఎన్నికలు) సమీపిస్తున్నందున, ఎన్నికలు, రాజకీయ సమీకరణ కోసం మత విభజనకు పదును పెట్టడం బీజేపీకి ప్రధానంశంగా మారింది'' అని ఒక పత్రికా సమావేశంలో ఏచూరి అన్నారు. ప్రస్తుతం ఘర్షణలు చోటు చేసుకున్న అనేక ప్రాంతాల్లో గతంలో రామనవమి వేడుకల సందర్భంలో ఎన్నడూ అల్లర్లు జరగలేదని తెలిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల తర్వాత వాస్తవ బీజేపీ వ్యతిరేక కూటమికి ఒక రూపం ఏర్పడుతుందన్నారు. ఈ కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక రాజకీయ కూటమి ఉంటుందనీ, అయితే బీజేపీ వ్యతిరేక శక్తుల సమూహాన్ని పెంచుకోవాలన్నదే ఆలోచన అని ఏచూరి చెప్పారు. 1996, 2004లో రెండు సందర్భాల్లో కూటములు ఎన్నికల తర్వాతే ఏర్పడ్డాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్తో పోటీ పడినప్పటికీ.. 2004లో కేంద్రంలో మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి సీపీఐ(ఎం) మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్ని లౌకిక, ప్రజస్వామిక ప్రతిపక్షపార్టీలతో చర్చలు కొనసాగించాలని సీపీఐ(ఎం) నిర్ణయించిందని ఏచూరి తెలిపారు. '' రాబోయే 2024 ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో దేశభక్తి, లౌకిక ప్రతిపక్ష శక్తులను పెంచడానికి ఈ ప్రయత్నం ఉంటుంది. తద్వారా ప్రతిపక్షంలో విభజనను బీజేపీ అనుకూలంగా మార్చుకోలేదు'' అని ఆయన అన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తిగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విశ్వసనీయత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉన్నదని తెలిపారు. రాజకీయాలు అంటే కేవలం నంబర్ల గురించి కాదనీ, స్థిరమైన మిత్రుడు ఎవరన్న కోణంలో దానిని చూడాలన్నారు. లెఫ్ట్, కాంగ్రెస్, ఇతర లౌకిక శక్తులను ఒంటరి చేయడమే తృణమూల్, బీజేపీల ఉద్దేశమైతే, భవిష్యత్తులో వారిద్దరు కలిసి ఏమి చేస్తారన్నదే ఇక్కడ అసలు విషయమని తెలిపారు. ఇటీవల భారత ముస్లింలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆమె వాదన పూర్తిగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. దేశంలో మోడీ పాలనలో గత ఎనిమిదేండ్లకు పైగా వాస్తవ వేతానాలు స్తబ్దుగా ఉన్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఒకవేళ వాస్తవ వేతనాలు స్తబ్దుగా ఉంటే ప్రజల వినియోగం తగ్గిందనీ, దానర్థం పేదరిక స్థాయిలు పెరుగుతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేండ్లలో మెరుస్తున్న భారత్, బాధపడుతున్న భారత్ అనే రెండు భారత్లు ఏర్పడ్డాయనీ, ధనవంతులు ధనవంతులుగా.. పేదలు పేదలుగానే ఉంటున్నారని ఆయన తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), గవర్నర్ వ్యవస్థ వంటివి దుర్వినియోగం అవుతున్నాయని ఏచూరి ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమవుతున్నదని తెలిపారు.