Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపిక చేయనున్న కేంద్రం
- మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ ఆఫీసర్లు
న్యూఢిల్లీ : సమాచార సాంకేతిక నిబంధనలు, 2021లో ప్రతిపాదించిన ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్లో నలుగురు సభ్యులు ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఇందులోకి సభ్యులను కేంద్రం తీసుకోనున్నది. ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రతినిధి, గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నుంచి ఒకరు, ఒక 'మీడియా నిపుణులు', ఒక 'న్యాయ నిపుణులు' ఇందులో ఉండనున్నారు. అయితే, ఈ కూర్పు అనేది విమర్శకుల నుంచి వస్తున్న ఆందోళనలు, అనుమానాలకు ఉపశమనం కలిగిస్తుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు అన్నారు. ఈ యూనిట్లో వివిధ మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ ఆఫీసర్లు ఉండనున్నట్టు తెలిపారు. దాదాపు పదిరోజుల్లో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్, దాని సంబంధ వివరాలను తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. తప్పుదారి పట్టించే, నకిలీ వార్తలను గుర్తించడంలో విశ్వసనీయత, తటస్థతను నిర్ధారించడానికి యూనిట్ అత్యున్నత స్థాయి వృత్తిపరమైన, నైతిక ప్రమాణాలను సమర్థిస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే వార్తలను గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటుకు ఐటీ నిబంధనల్లో మోడీ సర్కారు ఇటీవల సవరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, పలు ప్రముఖ మీడియా సంస్థలు, డిజిటల్ హక్కుల సంస్థలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆన్లైన్లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది అడ్డుగా ఉంటుందని పలువురు ఆందోళన వెలిబుచ్చారు.