Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకం నుంచి తొలగింపు
- భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌కు సంబంధించిన రిఫరెన్సులు కూడా..
- చరిత్రకారులు, విద్యావేత్తలు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని విద్యా వ్యవస్థను ఉపయోగించుకొని గత చరిత్రను దాచే యత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా పాఠ్యపుస్తకాల నుంచి కీలక అంశాలు, భాగాలు, పేరాలు, ప్రకటనలను తొలగిస్తున్నది. ఇప్పటికే అనేక కీలక భాగాలను పుస్తకాల నుంచి తీసివేసిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) భారత్‌లో జమ్మూకాశ్మీర్ విలీనానికి సంబంధించిన కీలక ప్రకటననూ తీసివేసింది.
11వ తరగతికి చెందిన పొలిటికల్ సైన్స్ పుస్తకం పదో చాప్టర్ నుంచి నుంచి దీనిని తొలగించింది. జమ్మూకాశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత అది స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుందన్న హామీ మీద ఆధారపడి విలీన ప్రక్రియ జరిగిందన్నది ప్రకటన కీలకాంశం. అయితే, జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన ఈ ప్రత్యేక అంశాన్ని రాబోయే తరం తెలుసుకోకుండా మోడీ సర్కారు పుస్తకాల ప్రకక్షాళనకు దిగిందని విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35(ఏ) లను మోడీ సర్కారు తన రెండో టర్మ్ పాలనలో రద్దు చేసిన విషయం విదితమే. ఈ ఆర్టికల్‌ల రద్దు తర్వాత ప్రతిపక్షాలు, జమ్మూకాశ్మీర్‌లోని పౌర సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మోడీ సర్కారు నియంతృత్వ ధోరణిని తప్పుబట్టాయి. ఇది జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కులను హరించడమేనని ఆందోళన వ్యక్తం చేశాయి. అయినప్పటికీ మోడీ సర్కారు మాత్రం అంతర్జాతీయంగా ఏర్పడే ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా ఈ విషయంలో ఏకపక్షంగా ముందుకు వెళ్లడం గమనార్హం.
ఇటు మోడీ ప్రభుత్వం భారత తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి గొప్ప పేరు సంపాదించిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌కు చెందిన అన్ని రిఫరెన్సులను సైతం తొలగించడం గమనార్హం. పాత 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకం '' ఇండియన్ కానిస్టిట్యూషన్ ఎట్ వర్క్''లోని మొదటి చాప్టర్ నుంచి ఆజాద్‌కు సంబంధించిన అన్ని రిఫరెన్సులు తొలగింపునకు నోచుకోవడం గమనార్హం.
ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో మొఘల్ చరిత్ర, ఆరెస్సెస్‌పై నిషేధం, హిందూ-ముస్లింల ఐక్యతకు గాంధీ చేసిన కృషి వంటి అంశాలతో పాటు తాజాగా పైన పేర్కొన్న విషయాలనూ తొలగించడంపై దేశంలోని చరిత్రకారులు, విద్యానిపుణులు, సామాజికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగమే ఇలాంటి వరుస మార్పులని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే భారత దేశ వాస్తవ చరిత్రను విద్యార్థులు తెలుసుకోలేరనీ, ఇది దేశ అస్థిత్వానికే ప్రమాదమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం హేతుబద్ధంగా ముందుకు వెళ్లాలనీ, విద్యా నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని వారు తెలిపారు.