Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ జయంతి సభలో ఏచూరి
- అంబేద్కర్ చెప్పిన దానికి భిన్నంగా భారత్ : బృందాకరత్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాలను బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపశిల్పి, స్వతంత్ర భారత తొలి న్యాయ మంత్రి బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం నాడిక్కడ పార్లమెంట్ స్ట్రీట్లో దళిత శోషణ్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. తొలిత సీతారాం ఏచూరి, బృందా కరత్, ఎఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఎఐకెఎస్ ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లా తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశ రాజ్యాంగ పరిరక్షణ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే ప్రస్తుత దేశ పాలకుల లక్ష్యమని, దేశంలో ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్యం ఉన్నదని మోడీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. రాజు మాత్రమే అన్ని ప్రయోజనాలను పొందే వ్యవస్థను వారు ప్రజాస్వామ్యంగా అభివర్ణిస్తున్నారని ఎద్దేవా చేశారు. పౌరులందరికీ సమాన హక్కులుండే ప్రజాస్వామ్యం కావాలని అంబేద్కర్ కలలు కన్నారని పేర్కొన్నారు. కానీ దేశంలో అసమానతలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని, దిగువన ఉన్న జనాభాలో 50 శాతం మంది సంపదలో 3 శాతం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. వర్గ పోలరైజేషన్ సృష్టించి ప్రజలను దోచుకుంటు న్నారని విమర్శించారు. దేశంలో అందరి ఓటు సమానమైనప్పటికీ అదానీలు, అంబానీలకు ప్రత్యేక రక్షణ లభిస్తోందని తెలిపారు. కోట్లాది మంది పేదలుగా మారుతున్నారని, సామాజిక అన్యాయాన్ని పెంచే విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం జరగాలని సీతారాం ఏచూరి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను దోచుకోవడం, ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగాల కోసం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని కోల్పోతున్నారన్నారు. సామాజిక అన్యాయాన్ని తొలగించేందుకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సామాజిక న్యాయమనేది కేవలం ప్రకటనలకే మాత్రమే పరిమితమైందన్నారని విమర్శించారు. నిరుద్యోగం ప్రబలిందని, ద్రవ్యోల్బణం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని, ఎనిమిదేండ్లుగా కార్మికుల నిజమైన వేతనాలు పెరగలేదని తెలిపారు.
తెలంగాణ, ఏపీ భవన్ల్లో అంబేద్కర్ జయంతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ల అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాధం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో అంబేద్కర్ సేవలను కొనియాడారు. రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సమానత్వం కోసం శ్రమించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పిఆర్సీ) ఆదిత్యనాథ్ దాస్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ కమిషనర్ ఎన్.వి రమణా రెడ్డి, ఎఆర్సీ హిమాన్షు కౌశిక్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్ సి) గౌరవ్ ఉప్పల్, ఇరు భవన్ల సిబ్బంది, పోలీసులు అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలిత ఏపి భవన్ పిఆర్సీ, ఏఆర్సీ, తెలంగాణ భవన్ ఆర్సీలు జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాజీ ఎంపీ జె. వి. మహేశ్వర రావ్ పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన చిన్నారులు సంగీత, నృత్య, సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు.
అంబేద్కర్ చెప్పిన దానికి భిన్నంగా భారత్ : బృందాకరత్
పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ మాట్లాడుతూ 70 ఏండ్ల క్రితం అంబేద్కర్ చెప్పిన దానికి, ఇప్పుడు దేశంలో జరుగుతున్న దానికి సంబంధము ందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ దేశ పౌరులుగా ఉండి రాజకీయ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ దేశంలో మోడీ సర్కార్ పాలన దళిత వ్యతిరేకంగా ఉందని అన్నారు. దళితులపై దాడులు ప్రభుత్వ మద్దతుతో పెరుగుతున్నాయని విమర్శించారు. డీఎస్ఎంఎం రాష్ట్ర కార్యదర్శి నత్తు ప్రసాద్ మాట్లాడుతూ దళితులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు. జననాట్య మంచ్ కార్యకర్తలు వీధి నాటకం ప్రదర్శించారు. పార్లమెంట్ స్ట్రీట్లో ఘనంగా వేడుకలు జరిగాయి. వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉపన్యాసాలు, కళా కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శన, ప్రదర్శన, భోజన పంపిణీ నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.