Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ ఫిర్యాదుల సెక్షన్లోకి కుల వివక్ష కంప్టైంట్లు
- విద్యావేత్తలు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త నిబంధనలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. కులాధారిత వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను సాధారణ కంప్టైంట్ల సెక్షన్లోకి చేర్చింది. అయితే, విద్యాసంస్థల్లో కుల వివక్షను నిరోధించడానికి తీసుకొచ్చిన నిబంధనలను ఇది నీరు గారుస్తుందన్న భయాందోళనలు విద్యావేత్తలు, నిపుణుల నుంచి వ్యక్తమయ్యాయి. ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా విద్యార్థుల సమస్యల పరిష్కార కమిటీ (ఎస్జీఆర్సీ)ని ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని నిబంధనలను యూజీసీ ఇటీవల కొత్తగా తీసుకొచ్చింది. విద్యార్థుల సమస్యల విషయంలో ఈ ఎస్జీఆర్సీ దృష్టిని సారిస్తుంది. ఎస్జీఆర్సీ పరిధిలో కులాల ఆధారంగా విద్యార్థులపై వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ప్రతి ఇన్స్టిట్యూషన్ విద్యార్థుల ఫిర్యాదులను వినేలా అంబుడ్స్పర్సన్ను (రిటైర్డ్ వైస్ చాన్సలర్ లేదా రిటైర్డ్ ప్రొఫెసర్ లేదా జిల్లా మాజీ జడ్జి) తప్పక నియమించాల్సి ఉంటుంది. యూజీసీ 2012 నిబంధనల ప్రకారం ప్రతి ఉన్న విద్యా సంస్థలో వివక్ష వ్యతిరేక అధికారి నేతృత్వంలోని సమాన అవకాశ సెల్ (ఈఓసీ) తప్పక కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల విషయంలో కుల వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను ఈ సెల్ విచారించేది. అయితే, కొత్త నిబంధనల ప్రకారం ఈ సెల్ రద్దు చేయబడుతుందా? లేదా అన్నదానిపై మాత్రం ఎలాంటి స్పష్టతా లేదని తెలిసింది. కొత్త నిబంధనలు అనవసర గందరగోళాన్ని సృష్టిస్తాయని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్. సుకుమార్, యూజీసీ మాజీ అధిపతి సుఖడియో తొరట్, ఇతర విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ సమస్యలతో కుల వివక్ష ఫిర్యాదులను కలపకూడదని అన్నారు.