Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్థవంతమైన చర్చలు జరపాలి :కేంద్రాన్ని కోరిన ఐఎన్ఎస్
న్యూఢిల్లీ : సమాచార సాంకేతిక (ఐటీ ) నిబంధనల్లో మోడీ సర్కారు చేసిన సవరణలపై ఇండియన్ వార్తపత్రిక సొసైటీ (ఐఎన్ఎస్) స్పందించింది. ఐటీ సవరణ నిబంధనలు, 2023ను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ మార్పులతో తీవ్ర కలత చెందినట్టు ఐఎన్ఎస్ వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సవరణ నిబంధనలను కేంద్రం ఈనెల 6న కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన విషయం విదితమే. కొత్తగా నోటిఫై చేసిన నిబంధలన ప్రకారం ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటు విషయంలో కేంద్రం అధికారాన్ని అనుభవిస్తుందని ఐఎన్ఎస్ వివరించింది. ఫ్యాక్ట్ చెకింగ్‌కు నకిలీ వార్తలను గుర్తించే అధికారం ఏకపక్షమనీ, అది సహజ న్యాయం అన్ని సూత్రాలకు విరుద్ధమని ఐఎన్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక గెజిట్‌లో సాధారణ నోటిఫికేషన్‌ను ప్రచురించడం ద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖ ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందన్న విషయాన్ని గమనించాలన్నారు.
తీవ్ర విమర్శల అనంతరం ఈ ఏడాది జనవరిలో డ్రాఫ్ట్ సవరణలను వెనక్కి తీసుకున్న తర్వాత మీడియాసంస్థలతో చర్చలు జరుపుతామని కేంద్రం ఇచ్చిన హామీని ఐఎన్ఎస్ గుర్తు చేసింది. అయితే, కేంద్రం సంబంధిత సంస్థలు, వ్యక్తులతో ఎలాంటి అర్థవంతమైన చర్చలు జరపలేదని వివరించింది. కేంద్రం తన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకొని సంబంధిత సంస్థలు, వ్యక్తులులతో విస్తృత అర్థవంతమైన చర్చలు జరపాలని ఐఎన్ఎస్ కేంద్రాన్ని కోరింది.