Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుల్వామా ఘటన ప్రభుత్వ అసమర్థతే
- అప్పుడు మా నోరు మూయించారు
- ఎన్నికల లబ్ది కోసం జవాన్ల ప్రాణాలు ఫణంగా పెట్టారు
- ప్రతిపక్షాల మండిపాటు
న్యూఢిల్లీ : 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి నరేంద్ర మోడీ ప్రభుత్వ అసమర్థత, ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమంటూ ఓ ఇంటర్వ్యూలో జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన విమర్శలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాలిక్ వ్యాఖ్యలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని, ప్రభుత్వ అసమర్థతను బయటపెడుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మాలిక్ మాటలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందిస్తూ 'ప్రధాని అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు' అని ఎద్దేవా చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారిక ట్విటర్ పేజీలో మాలిక్ విమర్శలను పునరుద్ఘాటించింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రధాని మోడీ ఈ ఘటన తీవ్రతను తక్కువ చేసి చూపారని పేర్కొంది. సైనికులకు విమానం పంపి ఉంటే 40 ప్రాణాలు గాలిలో కలిసేవి కావని విమర్శించింది.
మాలిక్ చెప్పినదే నిజమై ఉంటే అంతకంటే దారుణం మరొకటి ఉండబోదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ అన్నారు. 'అత్యున్నత రాజ్యాంగ పదవికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవినీతి అనేది బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత కాదని అర్థమవుతోంది' అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పుల్వామా ఘటనలో వాస్తవాలు బయటకు వచ్చాయని ఆర్జేడీ తెలిపింది. ఈ ఘటన తర్వాత ప్రతిపక్షాలు ఇవే విషయాలను ప్రస్తావిస్తే బీజేపీ ప్రభుత్వం వాటి నోరు నొక్కేసిందని శివసేన (ఠాక్రే గ్రూపు) నేత సంజరు రౌత్ గుర్తు చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విమానం కోసం అడిగితే ఎందుకు ఇవ్వలేదని సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి మనోజ్ సింగ్ కాకా ప్రశ్నించారు. రాష్ట్రపతి భవన్ సందర్శకుల జాబితాను ప్రధాని కార్యాలయం ఆమోదించాల్సి ఉంటుందని మాలిక్ చెబుతున్నారని, అంటే రాష్ట్రపతిని కేవలం ఒక కీలబొమ్మగా మారుస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సాల్మన్ అనీస్ సోజ్ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి జరిగిన తర్వాత మోడీ తనకు ఫోన్ చేసి, ఈ ఘటనపై నోరు విప్పవద్దని చెప్పారంటూ మాలిక్ వెల్లడించడాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు.
మాలిక్ ఏం చెప్పారంటే.....
పుల్వామా ఘటనలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వైఫల్యాలపై నోరు విప్పవద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీ తనకు చెప్పారని అప్పటి జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. 'ప్రభుత్వ అసమర్థత, సీఆర్పీఎఫ్, హోం మంత్రిత్వ శాఖ ఉదాశీనత కారణంగానే పుల్వామా దాడి జరిగింది. సైనికులను చేరవేసేందుకు విమానం కావాలని కోరితే హోం శాఖ నిరాకరించింది. దాడి జరిగిన తర్వాత ప్రధాని నాకు ఫోన్ చేశారు. నేను ఈ విషయాలన్నీ ఆయనకు వివరంగా చెప్పాను. మౌనం వహించమని, ఎవరికీ ఏమీ చెప్పవద్దని ఆయన ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇదే మాట అన్నారు. పాకిస్తాన్‌పై నెపం మోపి, ఎన్నికలలో లబ్ది పొందేందుకే ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది. ఈ సంఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉంది. మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను తీసుకొని ఒక కారు పాకిస్తాన్ నుండి వచ్చింది. అయితే అది 10-15 రోజుల పాటు జమ్మూకాశ్మీర్ గ్రామాల గుండా, రోడ్ల మీదుగా ప్రయాణించి వచ్చింది. మధ్యలో దానిని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమే' అని మాలిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.