Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ ప్రత్యర్థుల గొంతునొక్కేందుకే దర్యాప్తు సంస్థల వినియోగం
- మీడియా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ : అవినీతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడే సీబీఐ సమన్లు పంపుతుందనే విషయం తనకు తెలుసునని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ సమన్లు పంపిన నేపథ్యంలో శనివారం నాడిక్కడ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులో తమపై అబద్ధాలు చెబుతున్నాయని విమర్శించారు. అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలు పెడుతూ, వారిపై ఒత్తిడి పెంచడంతో తమను ఇరుకునపెట్టేందుకు చూస్తున్నాయని అన్నారు. తమ రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు దర్యాప్తు సంస్థలను అసాధారణ స్థాయిలో వినియోగిస్తున్నారని విమర్శించారు. ''కోర్టుకు సమర్పించిన ప్రతాల్లో దర్యాప్తు సంస్థలు అబద్ధాలు వినిపిస్తున్నాయి. 14 ఫోన్లను ధ్వంసం చేశామని చెప్పాయి. చేయని నేరాన్ని అంగీకరించేలా అనుమానితులపై తీవ్ర బెదిరింపులకు దిగుతున్నాయి. రేపు నీ కుమార్తె కళాశాలకు ఎలా వస్తుందో చూస్తాం అంటూ బెదిరిస్తున్నాయి'' అన్నారు.
ప్రధానిని అరెస్టు చేస్తారా..?
మద్యం విదానంలో మనీశ్ సిసోడియాపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేసిందని అన్నారు. ''వారు చెప్తున్న మద్యం పాలసీ నుంచి మనీశ్ సిసోడియా లబ్దిపొందారంటున్నారు. నెలల తరబడి విచారణ జరుపుతున్నా ఇంతవరకూ ఎలాంటి అవకతవకలను గుర్తించలేదు. వారు సోదాల్లో ఎలాంటి సొమ్మును గుర్తించనప్పుడు.. గోవా ఎన్నికల ప్రచారంలో దానిని వినియోగించారని ఎలా చెప్పారు? దానికి ఆధారం ఏంటి..? మేం ప్రతి చెల్లింపును చెక్ రూపంలో చేశాం. ఎలాంటి ఆధారం లేకుండా సెప్టెంబర్ 17న రాత్రి ఏడు గంటల సమయంలో ప్రధాని మోడీకి నేను రూ. వెయ్యి కోట్లు ఇచ్చా అని చెప్తా. అప్పుడు మీరు ప్రధానిని అరెస్టు చేస్తారా..?' అని కేజీవాల్ ఘాటుగా ప్రశ్నించారు. అబద్ధపు స్టేట్మెంట్లు ఇవ్వాలంటూ సాక్షులను చితకబాదుతున్నారని, అవినీతిని నిర్మూలించే గొప్ప విధానం ఇదే కావచ్చునని ఆయన విమర్శలు గుప్పించారు.
ఇదే మద్యం పాలసీని పంజాబ్లో అమలు చేస్తున్నాం
సీబీఐ తనను ఆదివారంనాడు హాజరుకావాలని పిలిచిందనీ, తప్పనిసరిగా హాజరవుతానని కేజ్రీవాల్ అన్నారు. 'ఈ మద్యం పాలసీనే పంజాబ్లో అమలు చేస్తున్నాం. దానివల్ల ఆదాయంలో 50 శాతం పెరుగుదల కనిపించింది. ఇది ఒక పారదర్శక, గేమ్ ఛేంజింగ్ పాలసీ' అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, సీబీఐ సమన్లు పంపినంత మాత్రాన అవినీతిపై కేజ్రీవాల్ పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజరు సింగ్ తెలిపారు.