Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులపై ప్రతికూల ప్రభావం
- ప్రాథమిక అవగాహన లోపిస్తుంది
- ప్రవేశ పరీక్షలకు కూడా సన్నద్ధం కాలేరు : ఎన్సీఈఆర్టీ నిర్ణయంపై విద్యావేత్తలు
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి చరిత్ర, రాజకీయ శాస్త్రానికి సంబంధించిన కొన్ని చాప్టర్లను తొలగించడమే కాదు... లెక్కలు, సైన్స్ సబ్జెక్టులలోని కొన్ని కీలక అంశాల 'హేతుబద్ధీకరణ' ప్రయత్నాలు కూడా విద్యార్థుల అభ్యసనంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : పాఠశాల విద్యకు సంబంధించిన విధానాలు, కార్యక్రమాలపై ఎన్సీఈఆర్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. విద్యార్థులపై భారం తగ్గించే పేరిట, హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా చాప్టర్లను తొలగించామని కుంటిసాకులు చెప్పింది. లెక్కల సబ్జెక్టులో యూక్లిడ్ డివిజన్ లెమ్మా (రెండు సంఖ్యల గసాభాను కనుగొనడం), వెక్టర్ ఆల్జీబ్రా (సదిశ బీజగణితం) చాప్టర్లను, జీవశాస్త్రంలోని రీప్రొడక్టివ్ సిస్టమ్స్ (ప్రత్యుత్పత్తి వ్యవస్థ) చాప్టర్‌ను తొలగించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమలులోకి వస్తాయి. ఈ చాప్టర్లను తొలగించడం వల్ల విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన లోపిస్తుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక జేఈఈ, నీట్, నాటా వంటి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల అవకాశాలపై కూడా ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయంతో 11, 12 తరగతుల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పర్బోధ్ బంబా అనే ఉపాధ్యాయుడు చెప్పారు. దేశంలో అనేక ప్రవేశ పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ ప్రామాణికంగా ఉంటోంది. గత కొంతకాలంగా ఈ సిలబస్‌ను బోర్డు తగ్గించి వేస్తోంది. దీంతో ప్రవేశ పరీక్షలకు సిద్ధపడడం విద్యార్థులకు కొంచెం సులభమవుతోంది. అయితే పదో తరగతిలో సిలబస్‌ను తొలగించడం వల్ల 11,12 తరగతుల సిలబస్‌ను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పాఠ్యాంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు ఆ అవకాశం లేకుండా పోతుంది.
'సెకండరీ గ్రేడ్‌లో మొక్కలు, జంతువులకు సంబంధించిన చాప్టర్లను తొలగించడంతో పాటు ప్రాథమిక తరగతుల నుండి కూడా తీసేశారు. ఈ పాఠ్యాంశాలను గురించి విద్యార్థులు ఇక ఎలా తెలుసుకుంటారు ?' అని ఒక ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు ప్రశ్నించారు. జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన ముఖ్యమైన చాప్టర్లను సైతం భౌతికశాస్త్రం నుంచి తొలగించారు. ఎన్సీఈఆర్టీ నిర్ణయం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఒకరు వ్యాఖ్యానించారు. కొన్ని పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తొలగించిన చాప్టర్లను సైతం బోధిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సులు నడుపుతున్నాయి.