Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ ముందు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- దేశ రాజధాని వీధుల్లో ఆప్ నిరసనలు
- సీబీఐ కార్యాలయం వద్ద పంజాబ్ సీఎంతో పాటు ఢిల్లీ మంత్రులు ధర్నా
- వందలాది మంది అరెస్టు
- వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు తొమ్మిది గంటలు పాటు విచారించారు. ఆదివారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కార్యాలయంలో సీబీఐ అధికారుల ముందు కేజ్రీవాల్ హాజరయ్యారు. దాదాపు తొమ్మిది గంటల పాటు ..56 ప్రశ్నలు వేశారు. ఇలా సుధీర్ఘంగా సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. లిక్కర్ కుంభకోణంలో సాక్షిగా వాంగ్మూలం నమోదుకే కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. కేజ్రివాల్ కు మద్దతుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ రాష్ట్ర మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు ధర్నాకు దిగారు. కేజ్రీవాల్ విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో పోలీస్ బలగాలు మోహరించాయి. అయినప్పటికీ కేజ్రీవాల్‌ను తమతోపాటు తీసుకెళ్లే వరకు తాము సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి కదిలేది లేదని ఆప్ నేతలు స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీథుల్లో ఆప్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపు 1,500 మంది ఆప్ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే, పోలీసులు తమను అరెస్ట్ చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా, సంజరు సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆప్ ఎంపీ సంజరు సింగ్ మాట్లాడుతూ కేజ్రీవాల్ మంచి విద్య, వైద్య విధానాన్ని దేశానికి ఇచ్చినందుకు ఆయనను శిక్షిస్తున్నారని విమర్శించారు. ఆయనను అణచివేయడానికి వ్యతిరేకంగా ఆప్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేజ్రీవాల్ లొంగిపోరని పేర్కొన్నారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ, బీజేపీని కేజ్రీవాల్ పతనం చేస్తారనే విషయం ఆ పార్టీ నేతలకు బాగా తెలుసునన్నారు.
అందుకే తమను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను జైలులో పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయడమే బీజేపీ నేతల ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపేందుకు పంజాబ్ నుంచి వచ్చిన తమ పార్టీ నేతలు, మంత్రులను సింఘు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నట్లు ఆప్ విమర్శించింది. డాక్టర్ బల్బీర్ సింగ్, బ్రమ్ శంకర్ జింప, హర్జోత్ సింగ్ బెయిన్స్, కుల్జిత్ రణధవా, ఎమ్మెల్యే దినేశ్ చద్దా తదితరులను ఢిల్లీ నగరంలోకి అడుగు పెట్టనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీ మద్యం కేసు ఓ కల్పితం : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు తనకు 56 ప్రశ్నలు సంధించినట్టు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. సీబీఐ సుదీర్ఘ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. '' సీబీఐ అధికారులు 56 ప్రశ్నలు అడిగారు. గౌరవంగానే ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. దిల్లీ మద్యం కేసు పూర్తిగా కల్పితం. అంతా భూటకం'' అని కేజ్రీవాల్ అన్నారు.
దిల్లీలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన 2020 నాటి నుంచి అన్ని వివరాలనూ సీబీఐ అధికారులు అడిగినట్లు కేజ్రీవాల్ తెలిపారు. దీని గురించి మరింత వివరంగా రేపు నిర్వహించబోయే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మాట్లాడతానని చెప్పారు. '' ఈ మద్యం పాలసీ కేసు పూర్తిగా అవాస్తవం. నిజాయితీనే ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతం. చావనైనా చస్తాం గానీ, నిజాయితీలో రాజీపడబోం. దిల్లీ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంలోనే ఈ కేసును తెర మీదికి తీసుకొచ్చారు. ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది. దీనిని అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నారు'' అని కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు. ఇదే కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కొత్త మద్యం విధాన కుంభకోణంకసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ఇవాళ దాదాపు 9 గంటల పాటు విచారించారు. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలని శుక్రవారం సీబీఐ సమన్లు జారీ చేయగా.. ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కేజ్రీవాల్ సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే, అప్పటినుంచి సీబీఐ అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చి తన కాన్వారులో ఇంటికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలకు కారులోంచి అభివాదం చేస్తూ కనిపించారు.