Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులది నేరచరిత్రే
- ప్రయాగ్‌రాజ్ ఘటనపై పలు అనుమానాలు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌లను శనివారం రాత్రి అందరూ చూస్తుండగానే దుండగులు కాల్చి చంపిన ఘటన ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. టీవీ కెమెరాల సాక్షిగా, పోలీసు వలయం నడుమ ఈ సంఘటన జరగడం సంచలనం సృష్టించింది. దీనిని భద్రతా వైఫల్యంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక పంపారు. అయితే ఇప్పటి వరకూ పోలీసులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనకు కారకులైన లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యలకు నేర చరిత్ర ఉన్నదని పోలీసులు చెబుతున్నారు. అయితే వారి కుటుంబస భ్యులు మాత్రం దీనితో ఏకీభవించడం లేదు. లవ్లేశ్ తివారీ గతంలో జైలుకు కూడా వెళ్లాడు. కుమారుడితో తమకు ఎలాంటి సంబంధాలు లేవని లవ్లేశ్
తండ్రి తివారీ అంటున్నారు. 'అతను మాతో ఉండడం లేదు. ఐదారు రోజుల క్రితం వచ్చాడు. కొన్ని సంవత్సరాలుగా అతనితో మాకు మాటలు లేవు' అని ఆయన చెప్పారు. లవ్లేశ్ పనీపాటా లేకుండా తిరుగుతుంటాడని, అతను మాదకద్రవ్యాలకు బానిస అని తెలిపారు. సంఘటన సమయంలో సహ నిందితులు జరిపిన కాల్పుల్లో లవ్లేశ్ కాలిపై గాయం అయింది. దీంతో అతనికి ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. మరో నిందితుడైన సన్నీపై 14 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ అయిన సన్నీ ప్రస్తుతం పోలీసులను తప్పించుకొని తిరుగుతున్నాడు. తండ్రి చనిపోవడంతో తనకు వచ్చిన వాటా అమ్ముకొని అతను అయిదేండ్లుగా వేరేగా ఉంటున్నాడు. 'అతను ఏ పనీ చేయడం లేదు. నేరస్తుడు ఎలా అయ్యాడో తెలీడం లేదు. ఈ ఘటన గురించి మాకేమీ తెలియదు' అని సన్నీ సోదరుడు పింటూ సింగ్ చెప్పారు. మూడవ నిందితుడు అరుణ్ చిన్నప్పుడే ఇల్లు విడిచి వెళ్లాడు. 2010లో ఒక పోలీసును రైలులో హత్య చేసినందుకు అతనిపై కేసు నమోదైంది. అతను ఢిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పని చేశాడు. ఈ ముగ్గురు నిందితులూ ప్రయాగ్‌రాజ్‌లోని ఒక లాడ్జిలో ఉంటున్నారు.
అతిక్ హంతకులకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
గ్యాంగ్‌స్టర్, రాజకీయ వేత్త అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌ను అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హత్య చేసిన ముగ్గురు నిందితులకు ప్రయాగ్ రాజ్‌లో కోర్టు ఆదివారం 14 రోజుల జ్యూడిషియల్ కస్డడీ విధించింది. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌ను శనివారం రాత్రి జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. వీరిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. వీరిని లవ్లీష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యాగా గుర్తించారు. వీరికి ప్రయాగ్ రాజ్‌లో కోర్టు 14 రోజుల జ్యూడిషయల్ కస్టడీ విధించినట్లు అహ్మద్ తరుపు లాయర్ మనీష్ ఖన్నా ఆదివారం తెలిపారు. కాల్పుల్లో స్వల్పంగా గాయపడ్డ లవ్లీష్ ప్రస్తుతం ఇక్కడి స్వరూప్ రాణి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.