Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్‌ను సజావుగా నడపనివ్వని బీజేపీ సర్కార్ : రాహుల్ గాంధీ
బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక కసరత్తు కొలిక్కిరావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కోలార్ ర్యాలీలో పాల్గొని ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. అదానీ అంశాన్ని పార్లమెంట్ ముందుకొచ్చేలా చేసేందుకు స్పీకర్ భయపడ్డారని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ డొల్ల కంపెనీ నడుపుతున్నారని పార్లమెంట్ వేదికగా తాను చెప్పాననీ, చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వలేదని రాహుల్ మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తానని తాను రెండుసార్లు స్పీకర్‌కు లేఖ రాసినా తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. తానేమీ చేయలేనని స్పీకర్ నవ్వుతూ నిస్సహాయత వ్యక్తం చేశారని చెప్పారు.
కర్నాటకలో అవినీతి బీజేపీ సర్కార్‌ను గద్దె దింపాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ల పంపిణీ కాషాయ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్టు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 130 స్ధానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో పరాజయంతో కాషాయ పార్టీకి దక్షిణాది ముఖద్వారం ఇక మూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.