Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగంపై పోరుబాట
- నిర్బంధాలు ఇంకెన్నాళ్లని నిలదీత
- 115 సంఘాలతో 'సంయుక్త యువమోర్చా' ఏర్పాటు
న్యూఢిల్లీ : దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యపై పోరాడేందుకు యువత నడుం బిగించింది. ఇందుకోసం దేశం నలుమూలల నుండి యువజన ప్రతినిధులు రాజధాని ఢిల్లీకి చేరుకొని 'సంయుక్త యువమోర్చ'ను ఏర్పాటు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు గళం విప్పారు. నిరుద్యోగం రూపంలో సంవత్సరాల తరబడి జరుగుతున్న దోపిడీని ప్రతిఘటించేందుకే తామంతా ఏకమయ్యామని వారు ప్రకటించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ వయోపరిమితిని దాటుతున్నామని, చివరికి విధిలేని పరిస్థితుల్లో చిన్నాచితకా పనులు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'మా కలలను నిజం చేసుకోవాలంటే, మాకు ఉజ్వల భవిష్యత్తు లభించాలంటే ఉద్యమాన్ని ప్రారంభించడం మినహా మరో దారి లేదు' అని యువమోర్చా భేటీలో తీర్మానాన్ని ఆమోదించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 115 యువజన సంఘాలు, స్వతంత్ర సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక మొదలుకొని ఉత్తరాదిన ఉన్న పంజా బ్, జమ్మూ, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వరకూ... యువజన ప్రతినిధులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు.
గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యపై యువత అనేక ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తోంది. సంవత్సరం పొడవునా ఆందోళనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి ఉద్యోగ నియామక పరీక్షల కోసం సన్నద్ధమవుతుంటే చివరి క్షణంలో పరీక్షా పత్రాలు లీక్ అవుతూ యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. దీనిపై ఆగ్రహావేశాలతో యువత రోడ్ల పైకి వస్తుంటే పోలీసులు లాఠీలు రుచి చూపిస్తున్నారు. కేసులు పెడుతూ అరెస్ట్ చేస్తు న్నారు. ఒక్క పేపర్ లీకేజీల కారణంగానే ఉత్తరప్రదేశ్ లో 22 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారు. ఖాళీల భర్తీలో చూపిస్తున్న అలసత్వంపై ఆ రాష్ట్రంలో 2021లో ఉద్యోగా ర్థులు ఆరు నెలల పాటు నిరసనలు నిర్వహించారు. 2020 అక్టోబర్‌లో అలహాబాద్‌లో ప్రదర్శన నిర్వహించిన విద్యార్థుల లో ఐదారుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విద్యార్థులు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చారు. పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతూ బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆగ్రహించిన పోలీసులు వేలాది మంది విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. దారుణమైన విషయమేమంటే వారిపై దోపిడీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి నిరసనలు జరుగుతున్నప్పటికీ ఆశించిన ఫలితం మాత్రం పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే యువజన సంఘాలన్నీ సంఘటితమై, పోరాడాలని నిర్ణయించాయి. పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలో సమస్య తీవ్రత మరింత అధికంగా ఉంది.
యువమోర్చా డిమాండ్లు ఇవీ...
ఢిల్లీకి చెందిన యువ హల్లా బోల్ (వైహెచ్బీ) ఆహ్వానం మేరకు జరిగిన ఈ సమావేశానికి వంద మందికి పైగా ప్రతినిధులు హాజరై తీర్మానంపై సంతకాలు చేశారు. ఉద్యోగ హక్కుకు చట్టబద్ధత కల్పించాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ నిస్పక్షపాతంగా, కాలపరిమితికి లోబడి భర్తీ చేయాలని తీర్మానంలో డిమాండ్ చేశారు. ఉద్యోగాల భరీలో కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి చెప్పాలని తీర్మానించారు. వివిధ రాష్ట్రాలలో సమస్యలపై పనిచేస్తున్న యువజన సంఘాలను ఏకీకృతం చేసి, రాజకీయ దిశానిర్దేశం చేయడమే తమ ఉద్దేశమని వైహెచ్బీ ప్రతినిధి అనుపమ్ తెలిపారు. దేశ రాజకీయ విధానాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పారు. యువతకు న్యాయ సహాయం అందించేందుకు 100 జిల్లాలలో న్యాయ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 'ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదన్న విషయం మాకు తెలుసు. అయితే ఉద్యోగాన్ని సంపాదించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. కనీస వేతనం అయినా ఇవ్వాలి. పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలి' అని కర్ణాటకకు చెందిన సరోవర్ కోరారు.
ఒక్కొక్కరిది ఒక్కో కథ...
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రజత్ సింగ్ ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరవ్వాలని ఆశించాడు. అయితే అతనిపై ఎన్నో నిర్బంధాలు...ఎఫ్ఐఆర్లు. అయినా వెనుకంజ వేయకుండా యువత కోసం పోరాడుతున్నాడు. పేపర్ లీకేజీలకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీరాలు పలికారు. 2019లో రాష్ట్రంలో 69 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం జరిగిన పరీక్షల్లో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై 2021 డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు జరిగాయి. ఉద్యమం ఉధృతం కావడం, ఎన్నికలు సమీపిస్తుండడంతో 17 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం నమ్మబలికింది. అయితే ఎన్నికలు పూర్తయి, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచింది. పైగా యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని ఆరోపిస్తూ రజత్ సింగ్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేసింది. పంజాబ్‌కు చెందిన అమన్‌దీప్ కౌర్‌ది మరో కథ. ఉపాధ్యాయ పోస్టు కోసం ఎంతో కష్టపడి చదివితే చివరికి ఆ ఖాళీలు రద్దయ్యాయి. దీనిపై న్యాయస్థానంలో కేసులు కూడా నడిచాయి. కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం పోయి అమ్ఆద్మీ సర్కారు వచ్చినా ఫలితం మాత్రం శూన్యం. మరో కేడర్‌కు సంబంధించి పరీక్ష నిర్వహించి, ఫలితాలు సైతం ప్రకటించారు. నియామక ఉత్తర్వులు వచ్చినా, ఉద్యోగంలో చేరే తేదీని అందులో ఇవ్వ లేదు. అటు మరో ఉద్యోగానికి వెళ్లలేక, ఇటు ఎంపికైన ఉద్యోగం లో చేరలేక...రెంటికీ చెడ్డ రేవడిలా కౌర్ పరిస్థితి తయారైంది.