Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న సర్పంచ్‌లు
- 11 గ్రామ పంచాయితీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు అవార్డులు
- అన్నీ తెలంగాణకే వచ్చే స్థాయిలో మన పల్లెలు : మంత్రి ఎర్రబెల్లి
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 13 జాతీయ అవార్డులు దక్కాయి. 11 గ్రామ పంచాయితీలు, ఒక మండల పరిషత్, ఒక జిల్లా పరిషత్‌లు ఈ అవార్డులను అందుకు న్నాయి. సోమవారం నాడిక్కడ విజ్ఞాన్ భవన్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ 'పంచాయితీల ప్రోత్సాహం పై జాతీయ సదస్సు అవార్డుల ప్రదానోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్రం తొమ్మిది కేటగిరిల్లో మొత్తం 46 జాతీయ అవార్డులను ప్రకటించగా, 13 అవార్డులను తెలంగాణ సొంతం చేసుకుంది. ఇందులో ఎనిమిది దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, ఐదు నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ఉన్నాయి. ఈ అవార్డులను రాష్ట్రపతి ముర్ము, కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ల చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు అందుకున్నారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అత్యధిక అవార్డులు సాధించిన తెలంగాణను భారత రాష్ట్రపతి అభినందించారు.
ఈ పంచాయితీలకు అవార్డులు సొంతం
నానాజీ దేశ్ ముఖ్ పురస్కారాల్లో ఉత్తమ జిల్లా పంచాయితీ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ములుగు పంచాయితీకి రూ.3 కోట్ల నగదు పురస్కారం వరించింది. అలాగే ఉత్తమ బ్లాక్ పంచాయితీ కోటాలో రెండో స్థానంలో చోటు దక్కించుకున్న కరీంనగర్ కు రూ. 1.75 కోట్ల నగదు బహుమతి దక్కింది. ప్రత్యేక కేటాగిరిలో మూడో స్థానంలో నిలిచిన ముక్రా పంచాయితీ(ఇచ్చోడ, ఆదిలాబాద్) రూ. 50 లక్షలు, సీఎన్వీపీపీ కేటాగిరిలో రెండో స్థానంలో నిలిచిన కంబా గ్రామ పంచాయితీ (నందిగామ, రంగారెడ్డి) రూ. 75 లక్షలు అందుకున్నాయి. దీంతో పాటూ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో, ఆరోగ్య పంచాయితీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతమ్ పూర్ గ్రామ పంచాయితీ, తగినంత నీరు కలిగిన గ్రామ పంచాయితీ విభాగంలో జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామ పంచాయితీ, సామాజిక భద్రత విభాగంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొంగట్ పల్లి, మహిళా స్నేహపూర్వక విభాగంలో సూర్యాపేట జిల్లాలోని ఏపూర్‌కు మొదటి స్థానం దక్కింది.
అగ్రస్థానంలో నిలిచిన ఈ గ్రామపంచాయితీలకు రూ.1 కోటి నగదు పురస్కారం దక్కింది. అలాగే పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి పంచాయితీ విభాగంలో జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన మండొడ్డి గ్రామ పంచాయతీ, పంచాయితీ విత్ గుడ్ గవర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లాలోని చీమల్దారి గ్రామ పంచాయతీకి రెండో స్థానం వరించింది. ఈ పంచాయితీలకు రూ. 75 లక్షలు ప్రోత్సాహకం లభించింది. పచ్చదనం, పరిశుభ్రత విభాగంలో పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్ పురికి మూడో స్థానం దక్కగా, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీ కూడా మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన ఈ పంచాయితీలు రూ. 50 లక్షలు అందుకున్నాయి. ఎర్రవల్లి (సిద్దిపేట) గ్రామ పంచాయితీకి సర్టిఫికేట్ దక్కింది. కాగా మొత్తం 13 పంచాయితీలకు కలిపి 12.5 కోట్లు దక్కాయి.
అన్ని అవార్డులు తెలంగాణకే వచ్చే స్థాయిలో మన పల్లెలు : ఎర్రబెల్లి
కేంద్రం ప్రకటించిన 45కు 45 అవార్డులు తెలంగాణకే వచ్చే స్థాయిలో తెలంగాణ పల్లెలు ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అవార్డుల ప్రదానోత్సవం తరువాత తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పల్లె ముఖచిత్రం మారడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించిందన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ పనితనాన్ని గుర్తించినందుకు అభినందనలని అన్నారు. నాలుగేండ్ల క్రితం కేసీఆర్ పంచాయతీ రాజ్ కొత్త చట్టం తీసుకొచ్చి, ప్రణాళిక ప్రకారం గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని చెప్పారు. అలాగే గ్రామాల అభివృద్ధిలో కేంద్రం గైడ్ లైన్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు వివరించారు. కానీ, మిషన్ భగీరథకు రూ. 19వేల కోట్లు ఇవ్వాలని నిటి ఆయోగ్ చెప్పినా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గుజరాత్‌కు ఇచ్చినట్టే తెలంగాణ మిషన్ భగీరథకూ నిధులు ఇవ్వాలని కేంద్రానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అవార్డులు ఇస్తూనే రాష్ట్రానికి ఇవ్వల్సిన నిధులను తగ్గిస్తున్నారు, తగ్గించవద్దంటు విన్నపించినట్టు చెప్పారు.
రూ. 907 కోట్లు మెటీరియల్ కంపోనెంట్ నిధులు రిలీజ్ చేయాలన్నారు. ఉపాధిహామీ పనిదినాలు పెంచడంతోపాటు, పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని తెలంగాణ సర్కార్ కోరుతుందని చెప్పారు. పంటలు పెరిగాయి, కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు బాధలు పడుతున్నారన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నా. ఉపాధి హామీ కూలీలకు ఆన్లైన్ హాజరు పెట్టడం దారుణమనీ, కూలీల పనిని గంట గంటకు వీడియో పెట్టాలనడం విచారకరమని చెప్పారు. ఇది కూలీలను అవమనపరచడమే అని అన్నారు.
సీఎం కేసీఆర్ హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పచ్చదనం, పరిశుభ్రత తో పాటు పలు అభివృధ్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలవటం, ఆ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ''దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చాయి. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్టు ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయం.'' అని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును., కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మెన్లు, పంచాయితీరాజ్ శాఖ అధికారులకు కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. పల్లె ప్రగతి సహా అనేక కార్యక్రమాల ద్వారా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని సీఎం అభిప్రాయపడ్డారు. పంచాయతీల అభివృద్ధిలో రాష్ట్రం ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్పూర్తితో మున్ముందు కూడా తమ కృషి కొనసాగుతుందని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.