Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హస్తినకు చేరిన బీజేపీ రెబల్ ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ : మణిపూర్లో ఎన్.బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సుమారు 10-12 మంది పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రిని మార్చాలని లేదా కనీసం రాష్ట్ర కేబినెట్లో మార్పులు చేయాలని వారు పార్టీ అధినాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలలో కుకీ తెగకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
కుకీ తెగకు చెందిన తిరుగుబాటుదారులపై పోలీసు చర్యను నిలిపివేస్తూ 2008లో అప్పటి ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదిరింది. అయితే బీరేందర్ సింగ్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని గత నెలలో రద్దు చేసింది. దీనిపై కుకీ తెగకు చెందిన స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. తమపై పోలీసులు ఉక్కుపాదం మోపడం వల్ల ప్రతి రోజూ ఇబ్బందులు పడుతూనే ఉన్నామని వారు తమ తెగకు చెందిన ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చారు. 'ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కారణంగా మణిపూర్లో, ఈశాన్య ప్రాంతంలో బీజేపీ బలపడింది. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడి నాయకత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదు. నిరంకుశంగా ప్రవర్తిస్తోంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం లభించాలని మేము కోరుకుంటున్నాం' అని పేరు చెప్పడానికి ఇష్టపడని తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.
ఇదిలావుండగా మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే కరమ్ శ్యామ్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పలేదని, ఈ పదవి అలంకారప్రాయంగా ఉందని ఆయన చెప్పారు.