Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో లేవు
న్యూఢిల్లీ : మైనారిటీ కమిషన్ల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయి. పది రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్ సహా ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటివరకూ మైనారిటీ కమిషన్లు ఏర్పాటు కాలేదు. కమిషన్ల ఏర్పాటుపై జాతీయ మైనారిటీల కమిషన్ ఛైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పలు దఫాలుగా లేఖలు రాశారు. అయితే ఇప్పటి వరకూ 17 రాష్ట్రాలు, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే మైనారిటీ కమిషన్లను ఏర్పాటు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో కమిషన్లు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమేనని అధికారులు తెలిపారు. గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఒడిసా, గోవా, అరుణా చల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో మైనారిటీ కమిషన్లు లేవు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లఢక్, చండీఘర్, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి, లక్షద్వీప్, పుదుచ్చేరిలో కూడా మైనారిటీ కమిషన్లు ఏర్పాటు కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన రాష్ట్రాలలో మాత్రం వీటిని ఏర్పాటు చేశారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో మైనారిటీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో ఇక్బాల్ సింగ్ ప్రస్తావించారు. రాష్ట్రాల స్థాయిలో వారి సమస్యలు పరిష్కారం కావాలంటే కమిషన్ల ఏర్పాటు అవసరమని ఆయన తెలిపారు.