Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుల్వామా ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ అప్పటి జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గళం విప్పిన రెండు రోజుల తర్వాత సైనిక దళాల మాజీ ప్రధానాధికారి కూడా పెదవి విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- అది నివారించగలిగినదే
- జవాన్లను విమానంలో పంపాల్సింది
- పుల్వామా ఘటనపై మాజీ ఆర్మీ చీఫ్ శంకర్ రాయ్
న్యూఢిల్లీ : పుల్వామా ఘటన నివారించదగినదేనని భారత సైనిక దళాల మాజీ ప్రధానాధికారి జనరల్ శంకర్ రాయ్ చౌదరి అభిప్రాయపడ్డారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది శ్రీనగర్‌కు రోడ్డు మార్గం ద్వారా కాకుండా విమానంలో వెళ్లి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. రోడ్డు మార్గాలు ఎప్పుడూ దాడులకు అనుకూలంగానే ఉంటాయని చెప్పారు. రెండున్నర వేల మందితో 78 వాహనాలు హైవే మీద ప్రయాణించి ఉండాల్సింది కాదని శంకర్ రాయ్ తెలిపారు. పుల్వామాలో 40 మంది జవాన్లు చనిపోవడానికి ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఎందుకంటే ఆయన జాతీయ భద్రతా సలహాదారు కూడా అని చెప్పారు. ఇంటెలిజెన్స్ వైఫల్యానికి కూడా ప్రధానే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జనరల్ రారు చౌదరి 1994 నవంబర్ నుండి 1997 సెప్టెంబర్ వరకూ ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించారు. 'సైనిక దళాలు భారీ కాన్వాయ్‌తో జాతీయ రహదారుల మీదుగా వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే ఆ మార్గాలు దాడులకు ఎప్పుడూ అనువుగా ఉంటాయి. పుల్వామాలో జమ్ము, శ్రీనగర్ మధ్య ఉన్న రహదారిపై ముజాహదీన్లు దాడి చేశారు. జవాన్లు రోడ్డు మార్గం మీదుగా కాకుండా విమానాలలో వెళ్లి ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదు.' అని జనరల్ రారు టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. పైగా పుల్వామా ప్రాంతం దాడులకు అత్యంత అనువైన ప్రదేశమని సైన్యంలో 40 సంవత్సరాలు పనిచేసిన రారు చెప్పారు. జమ్మూలోని సాంబా మీదుగా వెళ్లే రోడ్డులో ఉగ్రవాదుల చొరబాట్లు ఎక్కువగా జరు గుతుంటాయని గుర్తు చేశారు. అదీకాక ఆ సరిహద్దు ప్రాంతం పాకిస్తాన్‌కు ఎంతో దూరంలో లేదని చెప్పారు. 'నలభై మంది జవాన్లు అంటే పెద్ద సంఖ్యే. వారిని జమ్మూకాశ్మీర్‌లో మోహరించారు. ఈ దాడిని నూటికి నూరు శాతం ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే గుర్తించాలి' అని జనరల్ రారు అన్నారు. పుల్వామా ఘటనపై లేవనెత్తే ప్రశ్నలు జాతి వ్యతిరేకమంటూ బీజేపీ చేస్తున్న వాదనను ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేతులు కడిగేసుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. జనరల్ రాయ్ గతంలో పరమ్ విశిష్ట్ సేవా పతకాన్ని కూడా పొందారు.