Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారంటూ కేసు
- 567 రోజుల జైలు జీవితం
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నారనీ, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ నమోదు చేసిన కేసులో అసోం స్వతంత్ర ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్‌కి సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సీఏఏ వ్యతిరేక నిరసన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారంటూ గొగోరుపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయనపై అభియోగాల నమోదుకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును అనుమతిస్తూ ఫిబ్రవరి 9న అసోం హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే అంతకుముందు గొగోరు, మరో ముగ్గురిపై నమోదు చేసిన కేసును ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. వీరందరికీ క్లీన్చిట్ ఇచ్చింది. దీనిపై ఎన్ఐఏ కోర్టుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ అభియోగాల నమోదుకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను గొగోరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అంతకుముందు గొగోరు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన 567 రోజులు జైలులో గడిపారు. ఎన్ఐఏ కోర్టు క్లీన్చిట్ ఇచ్చిన తర్వాతే ఆయన విడుదలయ్యారు. గొగోరుపై నమోదైన రెండు కేసుల్లో ఒక దానిలో బెయిల్ వచ్చినా, రెండో కేసులో రాకపోవడంతో జైలులో గడపాల్సి వచ్చింది. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం దేశ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించినట్లు కాదని, అది ఉగ్రవాద చర్య కూడా కానేరదని కోర్టు స్పష్టం చేసింది.