Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిపిఎటిల లెక్కింపు కోరుతూ సుప్రీంలో పిల్
న్యూఢిల్లీ : రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో అన్ని వివిపిఎటి(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రెయిల్) లను లెక్కించాలని కోరుతున్న ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎం.ఆర్.షా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం దీన్ని విచారించనుంది. ఎన్జిఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఈ పిటిషన్ను దాఖలు చేసింది. తమ ఓటు నమోదైందా లేదా అని ఓటర్లు నిర్ధారించుకునేందుకు గానూ ప్రయోగాత్మక ప్రాతిపదికన ఈ పద్దతిని చేపట్టేందుకు భారత ఎన్నికల కమిషన్కు అవసరమైన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా పిల్ కోరింది. సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావె అందుబాటులో లేకపోవడంతో ఈ అంశంపై విచారణ వాయిదా పడింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగేలా చూడడంలో పేపర్ ట్రెయిల్ అనేది విడదీయరాని భాగమని పిల్ పేర్కొంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వివిపిఎటిలు లెక్కించేలా భారత ఎన్నికల కమిషన్ను ఆదేశించాల్సిందిగా పిల్ కోరింది. పేపర్ ట్రెయిల్ను ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే ఇవిఎంల పట్ల ఓటర్ల విశ్వాసాన్ని పొందగలుగుతామని పేర్కొంది. వివిపిఎటి వ్యవస్థతో కూడిన ఇవిఎంలు ఓటింగ్ వ్యవస్థకు కచ్చితత్వాన్ని కల్పిస్తాయని పేర్కొంది. వివిపిఎటి స్లిప్ ఏడు సెకన్ల పాటు డిస్ప్లే అవడం ద్వారా తమ ఓటు రికార్డయిందా లేదా అని తెలుసుకోవడానికి వీలు వుంటుంది. ''ఓటు నమోదు అయినట్లుగా లెక్కించబడింది'' అనడానికి సంబంధించి ఇప్పటివరకు చర్యలు శూన్యం. దీనికి తోడు ఏదైనా తేడా వుంటే నిరూపించుకోవాల్సిన భారం సదరు వ్యక్తిపైనే వుంటుందని పిల్ పేర్కొంది. కరెన్సీ నోట్లను లెక్కించే యంత్రాలతోనే వివిపిఎటి స్లిప్లను లెక్కించాలనే ప్రతిపాదన భారత ఎన్నికల కమిషన్ నుండి రావడం ఆసక్తికరం. కరెన్సీ లెక్కింపు యంత్రాలను గనక ప్రవేశ పెడితే సెకన్ల వ్యవధిలో అన్ని స్లిప్లను లెక్కబెట్టవచ్చునని మాజీ సిఇసి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ యంత్రాలను ఆ రీతిలో ప్రోగ్రామింగ్చేయాల్సి వుంటుంది లేదా యంత్రాలకు అనుగుణంగా వుండేలా పేపర్ సైజ్ను పెంచాల్సి వుంటుందని పేర్కొన్నారు. అందుకు అవసరమైన సాంకేతికత కూడా అందుబాటులో వుంది. కావాల్సిందల్లా సంకల్పబలం మాత్రమేనని పిల్ పేర్కొంది. ఇవిఎంలు, వివిపిఎటిలు రాజ్యాంగ విరుద్ధమని జర్మనీలో వారి సుప్రీం కోర్టు పేర్కొనడంతో తిరిగి పేపర్ బ్యాలెట్ వ్యవస్థకే మళ్ళారని మాజీ ప్రభుత్వ ఉద్యోగి, ఎన్నికలపై పౌరుల కమిషన్ సభ్యుడైన ఎం.జి.దేవసహాయం వ్యాఖ్యానించారు. అనవసరం, సమయం ఎక్కువ పడుతుందనే కారణంతో భారత ఎన్నికల కమిషన్ వివిపిఎటి స్లిప్లను లెక్కించే పద్ధతిని తిరస్కరించిందని పిల్ పేర్కొంది. కనీసం 50శాతం వివిపిఎటి స్లిప్లను లెక్కించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు, మరో 21 పార్టీలు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్గగోరు తిరస్కరించారు.