Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
డిపాజిటర్లకు చేసిన చెల్లింపుల్లో రహస్యం ఎందుకని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అలాంటిదేమీ లేనప్పుడు ఆయా వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెబి పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉందని, రెండు వారాలు గడువు ఇవ్వాలని కోరారు. ఏపి ప్రభుత్వం వాయిదా కోరుతూ లెటర్ సర్క్యులేట్ చేయగా.. దానిపై అభ్యంతరం తెలుపుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సోమవారం రాత్రి లెటర్ సర్క్యులేట్ చేసింది. దీన్ని గుర్తుచేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా అభ్యంతరం తెలిపారు. ఈ దశలో జస్టిస్ జెబి పార్దీవాలా జోక్యం చేసుకొని కొన్ని ప్లీడింగ్స్లో ప్రొప్రయిటరీ అని, కొన్ని ప్లీడింగ్స్లో హెచ్యుఎఫ్ (హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ) అని పేర్కొనడం సమస్యాత్మక అంశం కదా అని ప్రశ్నించారు. తదుపరి విచారణకు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. హెచ్యుఎఫ్ అంటే అసోసియేషన్ ఆఫ్ ఇన్డివిడ్యుయల్స్ కదా.. ప్రొప్రయిటరీ షిప్‌ను కూడా ఇందులో వ్యక్తిగత కెపాసిటీలో చూపుతున్నారా? దీనికి లీగాలిటీ లేదు కదా అని జస్టిస్ పార్దీవాలా ప్రశ్నించారు. గత విచారణలో డిపాజిటర్లందరికీ సొమ్ములు వెనక్కి ఇచ్చేశామని చెప్పారు కదా అని లూత్రానుద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.
ఈ సమయంలో పార్టీ ఇన్ పర్సన్ ఉండవల్లి అరుణ్‌కుమార్, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు... డిపాజిటర్లకు సొమ్ములు తిరిగి ఇచ్చేశామని అన్నారు. కానీ వివరాలు ఎక్కడా వెల్లడించలేదని గుర్తుచేశారు. ఇటు ప్రభుత్వానికి కానీ, అటు కోర్టుకు గానీ వివరాలు చెప్పలేదని అన్నారు. ఆయా వివరాలు అందజేయాలని కోరాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆడిటర్ చట్టం ప్రకారం తాము వివరాలు ఇచ్చామని లూత్రా తెలిపారు. వారిని వివరాలు అందజేయాలని కోరాలని మరోసారి ఉండవల్లి కోర్టును అభ్యర్థించారు. వివరాలు వెల్లడించడంలో ఏమైనా సీక్రెట్ (రహస్యం) దాగుందా అని లూత్రాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇందులో ఏమీ రహస్యం లేదని లూత్రా చెప్పగా అయితే, కోర్టులో ఫైల్ చేయాలని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. ఈ దశలో మార్గదర్శి తరపు మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జోక్యం చేసుకొని హైకోర్టు ఆర్డర్లో పేరా 27 ప్రకారం ఎవరైనా వివరాలు కావాలని ముందుకొస్తే అందజేస్తామని పేర్కొన్నారు. ''డిపాజిట్లు తిరిగి ఎవరెవరికి ఇచ్చారు. ఎంతెంత ఇచ్చారు. మీరు చెప్పాల్సిన అవసరం ఉంది'' అని లూత్రా, సింఘ్విలనుద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ''2007 మార్చి చివరి నాటికి డిపాజిట్ల రూపంలో సేకరించిన మొత్తం రూ.2,541 కోట్లు. తిరిగి వెనక్కి ఇచ్చింది రూ.2,596 కోట్లు.. తదనంతరం ఖాతాలో బ్యాలెన్స్ రూ.5.43 కోట్లు'' అని ఆడిటర్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని లూత్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, తదుపరి విచారణ సమయానికి ఆయా వివరాలు కోర్టుకు అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై తగిన యంత్రాంగం లేదని ఉండవల్లి కోర్టుకు తెలిపారు. రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై పలు కేసులు ఉన్నాయని, గూగుల్‌లో చూస్తే అన్ని తెలుస్తాయని పేర్కొన్నారు. గత విచారణ సమయంలో డిపాజిటర్ల వివరాలు రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) చెప్పాలని సుప్రీంకోర్టు సూచించగా.. ఆయా వివరాలు ఆర్‌బిఐకు అందజేశామని ఇక సమస్య ఏముందని లూత్రా చెప్పగా... ఆర్బిఐ కూడా ఈ కేసులో పార్టీ అన్న విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. వివరాలు వెల్లడించ డానికి మాకేం ఇబ్బంది లేదని లూత్రా పేర్కొన్నారు. ''రిజాయిండర్ దాఖలు చేయడానికి ఏపి ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం'' అని జస్టిస్ సూర్యకాంత్ ఆర్డర్ చదువుతుండగా.. డిపాజిటర్ల వివరాలు వెల్లడించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. ''డిపాజిటర్లకు చెల్లింపు వివరాలు అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు''లను ఆదేశిస్తున్నా మని జస్టిస్ సూర్యకాంత్ ఆర్డర్లో పేర్కొన్నారు. అనంతరం ''హైకోర్టులో ఉన్న కేసులో ఒకరు స్టేట్, ఒకరు ఎక్యూజ్డ్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కన్సెంట్ ఎవరిచ్చారు'' అనేది తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్‌ను జస్టిస్ జెబి పార్దీవాలా కోరారు.