Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాలంలో నిలిపేసిన ప్యాసింజర్ రైళ్లు పున:ప్రారంభించాలి
- నిధుల తగ్గింపుతో ఉపాధి హామీ నిర్వీర్యం : ఎఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పేదోడికి అవసరమైన ప్యాసింజర్ రైలు తీసేసి, ధనవంతుల అవసరాలకు అనుగుణంగా వందే భారత్ రైళ్లను తీసుకొస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శిం చారు. సోమవారం నాడిక్కడ ఆంధ్ర, తెలంగాణ భవన్లో బి. వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఇండియన్ రైల్వే దేశ ప్రజలకు చౌకైన, సౌకర్య వంతమైన ప్రయాణాన్ని అందించిందని, అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు కూడా పేదలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండేవని అన్నారు. అదే ఇప్పుడు మోడీ ప్రారంభిస్తున్న వందే భారత్ రైళ్లు అత్యంత ఖరీదైన ప్రయాణంతో కూడుకున్నవని తెలిపారు. మరోవైపు కోట్లాది మంది పేదలకు అనుకూలంగా ఉండే ప్యాసింజర్ రైలు రద్దు చేయడమే కాక ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను రద్దు చేస్తున్నారని విమర్శించారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా తత్కాల్ టికెట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్లు అంటూ కొత్త కొత్త పేర్లు పెట్టి రూ.1,000 ఉన్న టికెట్ ధరను రూ.3,000కు పెంచి ప్రజల మీద విపరీతమైన భారాలు మోపుతు న్నారని దుయ్యబట్టారు. ఇది రైల్వేలతో ప్రజలకు అందించాల్సిన సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని తలకిందులు చేసే విధంగా ఉందని విమర్శించారు. దేశంలో 3,752 రైళ్లు ఉండగా కోవిడ్ కాలంలో ఆపిన ప్యాసింజర్ రైళ్లను ఇంత వరకు ప్రారంభించలేదని, వాటిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తిరుపతి నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే 16 ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేశారని, మరోవైపు ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు తగ్గించి, ఏసి బోగీలు పెంచారని అన్నారు. దీంతో సామాన్యుల కున్న కొద్దిపాటి ప్రయాణ సౌకర్యాలను కూడా కోల్పో తున్నారని తెలిపారు. చౌక ప్రయాణమే కాక దేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అనుసంధా నగా ఉన్న రైల్వే నెట్వర్క్ను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. రైళ్లు, రైల్వే స్టేష న్లు ప్రైవేటీకరణ చేయడమే కాక, ప్రైవేట్ రైళ్లకు అను మతిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి రోజూ కేంద్రం డీజిల్ రేట్లు పెంచడం, దానికి తోడు తరచు గా టోల్ చార్జీలు పెరగటంతో ఆర్టీసీ బస్సు చార్జీలు క్రమంగా పేదలకు అందకుండా పోతున్నాయని అన్నారు.
నిధుల తగ్గింపుతో ఉపాధి హామీ నిర్వీర్యం
ఉపాధి హామీ చట్టం అమలుకు బీజేపీ మొదటి నుండి వ్యతిరేకంగా ఉందని, ఏదో విధంగా పేదలకు ఉన్న ఉపాధిని కనుమరుగు చేయాలని కుతంత్రాలు పన్నుతోందని విమర్శించారు. బడ్జెట్లో నిధులు తగ్గించడంతో పాటు కూలీలకు ఉపయోగం లేని టెక్నాలజీతో ఆన్లైన్ మస్టర్ వేయాలని, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడాలని అడ్డగోలు పద్ధతులను తెచ్చిందని తెలిపారు. గతేడాది చేసిన పనులకు నేటికీ అనేక రాష్ట్రాలలో బిల్లులు విడుదల కాక కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇటీవల అంబేద్కర్ జయంతి సభలను బీజేపీ ఆర్భాటంగా నిర్వహించిందని, రానున్న ఎన్నికల్లో ఓట్లు దండు కునేందుకు నాటకం ఆడుతోందని ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ, మరో వైపు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. భారత చరిత్రను బీజేపీ వక్రీకరి స్తున్నదని, చారిత్రక వాస్తవాలన్నీ రూపుమాపాలని ప్రయత్నిస్తుందని అన్నారు. రాజ్యాంగంలోని హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తూ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, రాజ్యాంగ రక్షణకు ప్రజలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాలపై మోడీ సర్కార్ కక్ష
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్టాలపై కక్ష కట్టిందని, ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలకు ఆన్యాయం చేస్తుంటే ప్రభుత్వాలు మాట్లాడటం లేదని విమర్శించారు. ఏడాదికిపైగా కార్మికులు, ప్రజలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు పోరాటం చేస్తుంటే, జగన్ వారికి మద్దతు ప్రకటించటం గాని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం గాని చేయకపోవడం సిగ్గు చేటని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి ఏపిని కార్పొరేట్ పరం చేస్తున్నారని, పోలవరానికి నిధులు ఇవ్వకపోతే మాట్లాడటం లేదని విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంత్ర పోకడలను, అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధానాలను ప్రతిఘటిస్తూ ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్ట నున్నట్లు ప్రకటించారు. దళితుల సమస్యలపై దశలవారీగా ఆందోళన చేపడతామని పిలుపునిచ్చారు.