Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర నిర్ణయానికి నిరసనగా రైల్‌రోకో
చండీఘర్ : పంజాబ్‌లో గోధుమ రైతులు కదం తొక్కారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాడైపోయిన, ముక్కిపో యిన గోధుమలకు కేంద్రం ధర తగ్గించడాన్ని నిరసిస్తూ రైలు పట్టాలపై బైఠాయించారు. రైతుల ఆందోళన కారణంగా అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భారతీ కిసాన్ యూనియన్, బీకేయూ (లఖోవాల్) సహా ఏడు రైతు సంఘాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రైల్‌రోకో నిర్వహించాయి. లూధియానా, అమృత్సర్, బఠిండా, ఫిరోజ్‌పూర్, సంగ్రూర్, ఫజిల్కా, గురుదాస్‌పూర్, తరన్‌తరన్ సహా పలు ప్రాంతాలలో రైళ్ల రాకపోకలను రైతులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల పట్టాలపై టెంట్లు కూడా వేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న గోధుమలను కొనుగోలు చేసే సమయంలో కేంద్రం ధరను తగ్గించడాన్ని నిరసిస్తూ రైల్‌రోకో చేపట్టామని బీకేయూ (ఏక్తా ఉగ్రహణ్) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలాన్ తెలిపారు. కేంద్ర నిర్ణయం రైతు వ్యతిరేకమని విమర్శించారు. సంక్షోభ సమయంలో రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం గోధుమల ధరను తగ్గించి కొనడం దారుణమని ఫిరోజ్పూర్లో ఓ రైతు సంఘం నేత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పంజాబ్, చండీఘర్, హర్యానా, రాజస్థాన్‌లో గోధుమ సేకరణకు సంబంధించి నాణ్యతా నిబంధనలను ప్రభుత్వం సడలించిందని, రైతుల ప్రయోజనాలు కాపాడటమే దీని ఉద్దేశమని ప్రభుత్వ అధికారి ఒకరు గత వారం తెలిపారు. చెడిపోయిన, ముక్కిపోయిన గోధుమల కొనుగోలుకు సంబంధించి ఆరు శాతం వరకూ ఎలాంటి ధర తగ్గింపు ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
వర్షాల కారణంగా దెబ్బతిన్న గోధుమల అమ్మకంలో రైతులకు జరిగే నష్టాన్ని తమ ప్రభుత్వం భరిస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు.