Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి : ఐఎండీ
న్యూఢిల్లీ : భానుడి ప్రతాపంతో యావత్ దేశం అల్లాడుతున్నది. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమో దవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. కాగా, మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొన సాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రతతోపాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్లో రానున్న నాలుగు రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది. ఇక సిక్కిం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ వేడిగాలులు వీస్తున్నాయి. కొన్ని వాతావరణ స్టేషన్లలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. పంజాబ్, హర్యానాలలో కూడా వేడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. హర్యానాలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడిగాలులు వ్యాపించాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని ఛండీగఢ్‌లో వేడి తీవ్రత అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.