Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోనే తొలిసారి
కొచ్చి : కేరళ ప్రభుత్వం 15 బ్లాక్ పంచాయతీలకు చెందిన 94 గ్రామ పంచాయతీలకు 'జల బడ్జెట్'ను ప్రచురించింది. ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశంలో ఇదే మొదటిసారి. కేరళలో ప్రతి సంవత్సరం చాలినంత వర్షపాతం నమోదవుతోంది. ప్రజావసరాలకు మించి నీరు అందుబాటులో ఉంటోంది. అయినప్పటికీ నడివేసవిలో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. కొరతను అధిగమించే దిశగా నీటి లభ్యతను పెంచడమే ఈ బడ్జెట్ ఉద్దేశం. దీని ప్రకారం స్థానిక పంచాయతీలు నీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటాయి. జల సంవత్సరం (జూన్ నుండి మే వరకు) అవసరాల కోసం బడ్జెట్‌ను సిద్ధం చేశారు. ఈ సంవత్సరంలో ప్రతి 10 రోజులను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఆ సమయంలో నీటి లభ్యత, వినియోగాన్ని గుర్తిస్తారు. హరిత కేరళ మిషన్‌లో భాగంగా నదులు, నీటిపారుదల కాలువలను పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో అన్ని పంచాయతీలకూ జల బడ్జెట్ రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 22న పంచాయతీలు బడ్జెట్‌ను సమర్పిస్తాయి. జల బడ్జెట్ విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.