Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో దశాబ్దం క్రితం నాటి కాలం చెల్లిన సమాచారమే దర్శనమిస్తోంది. నైరుతి రుతుపవనాలకు సంబంధించిన సమాచారాన్ని తాజా పరచలేదు. భారత వ్యవసాయ విభాగం అధికారులు 2020లో రుతుపవనాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని వెల్లడించినప్పటికీ ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో మాత్రం అది కానరావడం లేదు. పాఠశాల విద్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమాచారం అందించాల్సిన ఈ సంస్థ తన విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తోంది. 2010లో వాతావరణ విభాగం అందించిన సమాచారమే ఇప్పటికీ ఈ పుస్తకాలలో కన్పిస్తోంది. 'జూలై 15 నాటికి రుతుపవనాలు దేశంలోని వాయవ్య ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి' అని పాఠ్యపుస్తకాలలో ఉంది. అయితే సవరించిన అంచనాల ప్రకారం రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి జూలై 8 నాటికే ప్రవేశిస్తాయి. అదేవిధంగా రుతుపవనాలు సెప్టెంబర్ 1వ తేదీ నాటికి వెనక్కి వెళతాయని పాఠ్యపుస్తకాలలో పేర్కొన్నారు. అయితే వాతావరణ విభాగం మాత్రం రుతుపవనాలు సెప్టెంబర్ 17న వాయవ్య ప్రాంతం నుంచి నిష్క్రమిస్తాయని చెబుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలలో రుతుపవనాల రాకపై కూడా తాజా సమాచారం ఇవ్వలేదు. పాఠశాలల్లో విద్యార్థులకు తప్పుడు సమాచారమే అందిస్తున్నారు. దీనిపై కొందరు విద్యార్థులు ఎన్సీఈఆర్టీకి సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.