Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభా అంచనాలకు సంబంధించి 'స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023' పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్టు లెక్కకట్టింది. మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్టు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్టు తెలిపింది. ఐక్యరాజ్యసమితి జనాభా సమాచారాన్నిబట్టి జనాభా నిపుణులు భారత్ జనాభా ఈ ఏడాది పెరుగుతుందని అంచనా వేశారు. అయితే ప్రత్యేకించి ఏ నెలలో లేదా ఏ తేదీన చైనా జనాభాకంటే.. భారత్ జనాభా దాటుతుందనే విషయాన్ని జనాభా నిపుణులు పేర్కొనలేదు.
కాగా, 2011లో జనాభా గణన జరిగిందని, ఆ తర్వాత 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా ఆలస్యమైందని ఐక్యరాజ్యసమితి జనాభా అధికారులు తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆసియా దేశాలైన చైనా, భారత్ దేశాలే అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. అయితే గతేడాది చైనా జనాభా గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఆర్థిక వ్యవ్థను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే చైనా జనాభా తగ్గించుకుంటుందని నిపుణల అంచనా. 2011 నుంచి పరిశీలిస్తే భారతదేశ వార్షిక జనాభా సగటున సుమారు 1.2 శాతం పెరిగింది. భారత్లో జనాభా వేగంగా పెరుగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలిందని యూఎన్ఎఫ్పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్నార్ తెలిపారు. అయితే, జనాభా పెరుగుదల అనేది ఆందోళన అంశంగా చూసే బదులు పురోగతి, అభివద్ధి, వ్యక్తిగత హక్కులు, మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు.