Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే అంబేద్కర్‌కు నిజమైన నివాళి
ఓబీసీల గణన చేపట్టాలని దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు (ఎన్డీఏలోని పార్టీలతో సహా), సామాజిక సంస్థలూ కోరుతున్నాయి. తన హిందూత్వ ప్రయోజనాలకు అడ్డుగా నిలుస్తుందన్న ఒకే ఒక్క కారణంతో బీజేపీ నిరాకరిస్తోంది. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నది. కులగణన జరిగితే సామాజిక తరగతుల్లో ఎవరి సంఖ్య ఎంతో తేలిపోతుంది. ఆ ప్రకారం ఆయా తరగతులు తమ న్యాయమైన వాటా అడుగుతారు. ఇది తమ హిందూత్వ ఎజెండాను దెబ్బతీస్తుంది. అరెస్సెస్ చాతుర్వర్ణ వ్యవస్థ పునరుద్దరణ ఆకాంక్ష ఆవిరైపోతుంది. అందుకే కేంద్రం ఇందుకు మోకాలడ్డుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- చివరగా 1931లో కుల గణన
- ఆ లెక్కల మీదే ఆధారపడిన మండల్ కమిషన్
- వాస్తవ లెక్కలను బయటకు తీయాలి
- రాజకీయ విశ్లేషకులు, నిపుణులు
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత, తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను ఇటీవల ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఇంకా చెప్పాలంటే, అంబేద్కర్ జయంతిని గతంతో పోల్చుకుంటే దేశప్రజలు, యువత, సబ్బండ వర్గాలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన జయంతి వేడుకలు ఈ ఏడాది 150కి పైగా దేశాలలో జరిగాయి. అయితే, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్ తెగలు(ఎస్టీ), ఇతర వెనకబడిన వర్గాలు(ఓబీసీ), మైనారిటీ, అణగారిన, పీడిత వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి కుల గణనే అని రాజకీయ విశ్లేషకులు, సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆరెస్సెస్, ఇతర హిందూత్వ సంస్థలు, బీజేపీ, దాని అనుకూల సంస్థలు బయటకు అంబేద్కర్ పేరును చెప్పుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాయనీ అంతర్గతంగా మాత్రం అంబేద్కర్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నాయని విమర్శిస్తున్నారు. కుల నిర్మూలనకు పాటు పడిన అంబేద్కర్ ఆశయాలను అంతం చేయాలని చూస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఇందుకు నిదర్శనమని చెపుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు గార్చాలని ప్రయత్నించినా.. ఆ వర్గాల్లో ఐక్యత కారణంగా మోడీ సర్కారు వెనక్కి తగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
కేంద్రంలో 2014లో మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నాలనే చేపడుతున్నదని, ఇందులో భాగంగానే ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు కంపెనీలు, సంస్థలు, వ్యక్తులకు అప్పగించే చర్యకు పూనుకున్నదని చెపుతున్నారు. కార్పొరేటు, ప్రయివేటు వ్యక్తులు, సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా పని చేస్తున్నదంటున్నారు. మోడీ ప్రభుత్వం తన చేతికి మట్టి అంటకుండా ప్రయివేటీకరణ ద్వారా రిజర్వేషన్లను ఎత్తేసే ప్రయత్నాలను చేస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో జనగణన అనేది షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉన్నా.. అది జరగలేదు. దీంతో 2011 జనాభా లెక్కల మీదే ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యక్రమాలు ఆధారపడి పని చేస్తున్నాయి. ఇదిలావుండగా.. దేశంలో కుల గణన అవసరాన్ని నిపుణులు నొక్కి చెప్తున్నారు. దేశంలో చివరగా స్వాతంత్య్రానికి పూర్వం 1931లో కుల గణన జరిగిందనీ, అందులో వెనకబడిన తరగతులకు(బీసీ) చెందిన ప్రజలు 52 శాతంగా ఉన్నారని తేలిందని గుర్తుచేస్తున్నారు. ఈ సంఖ్య మీదే మండల్ కమిషన్ నివేదిక ఆధారపడిందని తెలిపారు. దీని ఆధారంగానే 1990 దశకంలో దేశంలోని బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
అయితే, దశాబ్దాల కాలం నుంచి దేశంలో కుల గణన జరగటం లేదనీ, దీని ద్వారా బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేస్తున్నారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని, దేశంలో సామాజిక, ఆర్థిక అంతరాలు తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ పాలనలో హిందూత్వ, జాతీయవాదం వంటి భావోద్వేగ రాజకీయాలు దేశ యువతను ఈ వాస్తవాలవైపు ఆలోచించనీయడంలేదని ఆందోళన చెందుతున్నారు. కులం ఆధారంగా జనాభా గణాంకాలు లేకపోవడంతో.. విద్యలో, ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. తనను తాను ఓబీసీగా చెప్పుకుంటున్న మోడీ.. కచ్చితంగా చేపట్టాల్సిన కులగణనపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజల ఆగ్రహానికి మోడీ సర్కారు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. కుల గణన జరపడమే అంబేద్కర్‌కు మనమిచ్చే ఘనమైన నివాళి అని పలువురు నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.