Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీపీ అధినేతతో రెండు గంటల పాటు చర్చ
- ముంబయిలోని శరద్ పవార్ ఇంటిలోనే జరిగిన సమావేశం
- 'హిండెన్‌బర్గ్-అదానీ' అంశం నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్న మీటింగ్
ముంబయి : హిండెన్‌బర్గ్ నివేదికతో అటు వ్యాపారపరంగా, ఇటు రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. ముంబయిలోని శరద్ పవార్ ఇంటిలో ఆయనతో భేటీ అయ్యారు. ఆర్థిక అవకతవకలు, స్టాక్ మోసాలకు పాల్పడ్డారని అదానీపై హిండెన్‌బర్గ్ తన నివేదికలో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఇలాంటి తరుణంలో అదానీ.. శరద్ పవార్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే అదానీ, శరద్ పవార్ల మధ్య భేటీ రెండు గంటలు సాగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని బృందంతో అదానీపై విచారణ జరపాలని మొదట్లో శరద్ పవార్ డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ డిమాండ్ నుంచి ఆయన కాస్త వెనక్కి తగ్గినట్టుగా కనిపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నట్టుగా జేపీసీకి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ తర్వాత తెలిపారు. అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై జేపీసీ వేయాలని ఇటు కాంగ్రెస్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా నియమించబడిన బృందం ద్వారా దర్యాప్తు జరపాలని, దీని ద్వారానే దర్యాప్తుపై అధికార బీజేపీ ప్రభావం ఉండకుండా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అటు శరద్ పవార్ అనడం.. రాజకీయ వర్గాల్లో కాస్త అనైక్యతకు దారి తీశాయని విశ్లేషకులు తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, అదానీ అంశంలో శరద్ పవార్ కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నదని విశ్లేషకులు తెలిపారు. అదానీని 'లక్ష్యంగా' చేసుకుంటూ ఆరోపణలు వచ్చాయని అప్పట్లో ఎన్డీటీవీ(ఈ ఛానెల్ ప్రస్తుతం అదానీ చేతిలో ఉన్నది)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్సీపీ అధినేత చెప్పారు. దీంతో ఆయన కామెంట్లపై అప్పుడు కొందరు ప్రతిపక్ష నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొందరు శరద్ పవార్ తీరును తప్పుబట్టారు. ఇప్పుడు అదానీతో భేటీ సైతం ఇలాంటి అనుమానాలకు బలం చేకూరుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడ్డారు.