Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర లేక రోడ్డుపై పారబోస్తున్న పంజాబ్ రైతులు
లూథియానా : తాము కష్టపడి పండించిన కాప్సికమ్ పంటకు కనీస ధర కూడా లభించకపోవడంతో పంజాబ్‌లోని మన్సా జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోకు రూపాయి ధర మాత్రమే పలుకుతుండడంతో పంటను రోడ్డు పైనే పారబోసి నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సూచన మేరకు తాము కాప్సికమ్ పంట వేశామని, ఇప్పుడేమో కనీస ధర కూడా లభించక నిండా మునిగిపోయామని రైతులు తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు విని ఐదు ఎకరాలలో పంట వేశానని, ఇప్పుడేం చేయాలో తోచడం లేదని గోరాసింగ్ అనే రైతు వాపోయారు. సీజన్ ప్రారంభంలోనే ఇంత తక్కువ ధర పలుకుతోందని, 15-17 కిలోల సంచీని 15 రూపాయలకు కొంటున్నారని చెప్పారు. పంజాబ్‌లో ఏడున్నర లక్షల ఎకరాలలో కూరగాయలు పండిస్తున్నారు. వీటిలో సుమారు నాలుగు వేల ఎకరాలలో కాప్సికమ్ వేశారు. ఈ సంవత్సరం ఇతర రాష్ట్రాల నుండి కూడా పంట పెద్ద ఎత్తున పంజాబ్‌కు రావడంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. కోవిడ్ సమయంలో సైతం కిలో 10-15 రూపాయల ధర పలికిందని రైతులు గుర్తు చేశారు. ఆ తర్వాత 2020, 2021 సంవత్సరాలలో కూడా కిలో 20 రూపాయల వరకూ పలికింది. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని రైతులు విమర్శించారు. పంటను కొల్కతా తీసికెళ్లి అమ్ముకునేందుకు సాయపడాలని వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పెదవి విప్పడం లేదు.