Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించిన జడ్జి
- అది మనసులో పెట్టుకొనే సిఫార్సును తొక్కిపెట్టిన కేంద్రం
- చేసేదేమీ లేక వెనక్కి తీసుకున్న సుప్రీం
న్యూఢిల్లీ : ఒరిస్సా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్. మురళీధర్‌ను మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ ఆరు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి తాను చేసిన సిఫార్సును సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కి తీసుకుంది. తన సిఫార్సును కేంద్రం ఆమోదించకపోవడం, జస్టిస్ మురళీధర్ మరో నాలుగు నెలలలోనే పదవీవిరమణ సమీపిస్తుండటంతో కొలీజియం ఈ నిర్ణయానికి వచ్చింది. జస్టిస్ మురళీధర్ ఆగస్ట్ 4వ తేదీన పదవీవిరమణ చేయాల్సి ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం తను సిఫార్సును పెండింగ్‌లో ఉంచిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కె కౌల్, కేఎం జోసఫ్, ఎంఆర్ షా, అజరు రస్తోగీతో కూడిన సుప్రీం కొలీజియం గుర్తించింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు జస్టిస్ మురళీధర్‌ను మద్రాస్ హైకోర్టుకు పంపినా ఆయన ఆరు నెలల పాటు కూడా అక్కడ పదవిలో ఉండే అవకాశం లేదని అభిప్రాయపడింది. దీంతో ప్రస్తుతం బాంబే హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎస్వీ గంగాపుర్వాలాను మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. హైకోర్ట్ న్యాయమూర్తులను బదిలీ చేయాలన్న సిఫార్సును కేంద్రం 10 రోజులలో ఆమోదించని పక్షంలో కొలీజియం తన సిఫార్సును వెనక్కి తీసుకుంటుందని ఫిబ్రవరి 3న జస్టిస్ కౌల్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా జస్టిస్ మురళీధర్ నియామకానికి కేంద్రం మోకాలడ్డడానికి బలమైన కారణమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని బెంచ్ 2020 ఫిబ్రవరి 26న ఢిల్లీ పోలీసులపై మండిపడింది. ఢిల్లీ అల్లర్లకు దారితీసేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్ (ప్రస్తుత కేంద్ర మంత్రి), ఎంపీ పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మలపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో కూడిన వీడియో క్లిప్పింగులను చూసి, ఎఫ్ఐఆర్ నమోదుపై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. అయితే అదే రోజు రాత్రి జస్టిస్ మురళీధర్‌ను కేంద్రం పంజాబ్ హర్యానా కోర్టుకు బదిలీ చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ బీజేపీ నేతలపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు.