Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిక్షను నిలిపివేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సూరత్ సెషన్స్‌కోర్టు
- అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు వినియోగించుకుంటాం : కాంగ్రెస్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. 'మోడీ' ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేండ్ల శిక్షను నిలిపివేయాలని ఆయన చేసిన అభ్యర్థనను సూరత్ సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అనర్హత వేటు నుంచి రాహుల్ గాంధీ తప్పించుకోవడం దాదాపు అసాధ్యమని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. ఈ పరువునష్టం కేసులో సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేటు కోర్టు రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. పై కోర్టులో సవాలు చేసేందుకు వీలుగా 30 రోజుల గడువును సైతం రాహుల్‌కు కల్పించింది. అనంతరం పార్లమెంటరీ సెక్రెటేరియట్ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఇప్పటికే ఆయన ప్రభుత్వ బంగ్లాను సైతం ఖాళీ చేశారు.
దీంతో రాహుల్ తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. శిక్ష నిలుపుదలతో పాటు తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ జరపకుండా కఠినంగా వ్యవహరించిందనీ, ఇది రెండేండ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదని రాహుల్ తన పిటిషన్లో కోరారు. శిక్షను నిలిపేయకపోతే తన ప్రతిష్టకు నష్టం కలుగుతుందని వివరించారు. రాహుల్ పిటిషన్‌పై న్యాయమూర్తి ఆర్పీ మొగేరా గత గురువారం (ఈనెల 13న) వాదనలు విన్నారు. దీనిపై గురువారం తీర్పును వెలువర్చారు. అలాగే, ఈనెల 3న విచారణ చేపట్టిన కోర్టు.. రాహుల్‌కు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే.
అయితే రాహుల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. చట్టప్రకారం తమకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను వినియోగించుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం రాహుల్‌కు ఉన్నదని నిపుణులు తెలిపారు.