Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్సూరెన్స్ స్కామ్ కేసులో చర్యకు ఉపక్రమించిన కేంద్ర దర్యాప్తు సంస్థ
- 'పుల్వామా'ఘటనపై కొన్ని రోజుల క్రితమే మాలిక్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీసర్కారుపై ఆరోపణలు చేస్తున్న జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇన్సూరెన్స్ స్కామ్ కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐ.. ఈ కేసులో సత్యపాల్ మాలిక్‌కు ఉన్న సంబంధంపై తాజా చర్యకు దిగింది. అయితే, సీబీఐ నోటీసులపై సత్యపాల్ మాలిక్ స్పందించారు. కొన్ని వివరణల కోసం అక్బర్ రోడ్‌లోని సంస్థ గెస్ట్ హౌజ్‌కు రావాల్సిందిగా సీబీఐ తనను అడిగిందని ఆయన చెప్పారు. అయితే, తాను రాజస్థాన్‌కు వెళ్తున్నందునన తాను అందుబాటులో ఉండే 27, 29 తేదీలను వారికి (సీబీఐ) ఇచ్చానని తెలిపారు. ఆరెస్సెస్ నేతకు చెందిన ఫైల్‌తో పాటు 'అంబానీ'కి చెందిన ఫైల్.. మొత్తం రెండు ఫైల్లు క్లియర్ చేయడానికి తనకు రూ. 300 కోట్లు ఆఫర్ చేశారని 2021లో అక్టోబర్‌లో సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. అయితే, ఆ ఫైల్లు ఏమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఈ ఆరోపణల ఆధారంగా ఏప్రిల్‌లో సీబీఐ రెండు కేసులను నమోదు చేసి 14 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్జీఐసీ), చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ (సీవీపీపీపీఎల్)కు చెందిన అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య బీమాను కల్పించే ఆర్జీఐసీ డీల్‌ను 2018లో సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. అయితే, ఈ ముడుపుల కేసుకు సంబంధించి సత్యపాల్ మాలిక్‌ను సీబీఐ గతేడాది ప్రశ్నించిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి విషయంలో మోడీ సర్కారు తీరును, కొన్ని సంచలన విషయాలను సత్యపాల్ మాలిక్ కొన్ని రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే.