Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు, విద్యావేత్తల డిమాండ్
- పాఠశాల విద్యకు 'ప్రమాదకరమైన మార్పు'గా అభివర్ణన
- 1,800 మంది సంతకాలతో లేఖ
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పాఠ్యాంశాల్లోని సైన్స్ సిలబస్ నుంచి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఉపసంహరించాలని ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయంపై శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. సైంటిఫిక్ టెంపర్‌ను అభివృద్ధి చేసుకోవడం కోసం పరిణామ ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. దీని గురించి విద్యార్థులకు తెలియజేయకపో వడాన్ని తప్పుబట్టారు. సెకండరీ ఎడ్యుకేషన్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా సభ్యులుగల స్వచ్ఛంద సంస్థ బ్రేక్‌త్రూ సైన్స్ సొసైటికి చెందిన ఈ శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు, విద్యావేత్తలుంతా ఈ మేరకు ఎన్సీఈఆర్టీకి బహిరంగ లేఖ రాశారు. పదో తరగతి సిలబస్ నుంచి బయోలాజికల్ ఎవల్యూషన్ థియరీని తొలగించాలని కేంద్రం ఉన్నత పాఠశాల పాఠ్యప్రణాళిక బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. ఇది పాఠశాల సైన్స్ విద్యకు 'ప్రమాదకరమైన మార్పు' అని పేర్కొన్నారు.ఈ లేఖపై దాదాపు 1,800 మంది సైంటిస్టులు, సైన్స్ టీచర్లు, విద్యావేత్తలు సంతకాలు చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), ఐఐటీలు వంటి ప్రముఖ సంస్థలకు చెందినవారంతా ఇందులో ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి భౌతిక శాస్త్రవేత్త సౌమిత్రో బెనర్జీ, బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి జీవశాస్త్రవేత్త రాఘవేంద్ర గడగ్కర్, బెంగళూరు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ డైరెక్టర్, జీవశాస్త్రవేత్త ఎల్.ఎస్ శశిధర, ముంబయి హౌమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అనికేత్ సూలే, ఐఐఎస్ఈఆర్ పూణే నుంచి జీవశాస్త్రవేత్త సుధా రాజమణి తదితరులు ఉన్నారు. ఎన్సిఇఈఆర్టి డైరెక్టర్‌కు ఇమెయిల్ పంపారు.
సైన్స్ ప్రాథమిక ఆవిష్కరణ గురించి విద్యార్థులకు తెలియకపోతే, వారి ఆలోచనా ధోరణి కుంటుపడుతుందని తెలిపారు. పరిణామ జీవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం, దానిపై పట్టు సంపాదించడం జీవ శాస్త్రంలోని ఉప శాఖలకు చాలా ముఖ్యమనీ, అంతేకాకుండా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికీ చాలా కీలకమని తెలిపారు. సమాజాలుగా, దేశాలుగా మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో మనం ఏ విధంగా వ్యవహరించాలనే అంశాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే శాస్త్ర విభాగం పరిణామ జీవ శాస్త్రమని పేర్కొన్నారు. ఔషధాలు, వైద్య రంగం నుంచి ఎపిడమియాలజీ, ఎకాలజీ, పర్యావరణం వంటివాటి నుంచి మానసిక ఆరోగ్య శాస్త్రం వరకు అన్నింటిలోనూ ఏ విధంగా వ్యవహరించాలో నిర్ణయించుకోవడంపై అత్యధిక ప్రభావం చూపే శాస్త్ర విభాగం జీవ పరిణామ శాస్త్రమని తెలిపారు. తోటి మానవులను మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలి? జీవితంలో వారి స్థానం ఏమిటి? అనే అంశాలకు కూడా దీనితో సంబంధం ఉందన్నారు. మనలో చాలా మంది బాహాటంగా తెలుసుకోకపోయినప్పటికీ, ఏదైనా మహమ్మారి ఏ విధంగా వృద్ధి చెందుతుంది? కొన్ని జీవులు ఎందుకు అంతరించిపోతున్నాయి? వంటి అనేక ఇతర ముఖ్యమైన అంశాల గురించి మనం అర్థం చేసుకోవడానికి సహజ ఎంపిక సిద్ధాంతాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంట్లో పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో సైన్స్ సబ్జెక్టులో చాప్టర్-9ని కేవలం 'హెరెడిటీ'గా మాత్రమే ఉంచినట్టు తెలిపింది. అంతకుముందు ఈ చాప్టర్ 'హెరెడిటీ అండ్ ఇవల్యూషన్'గా ఉండేది. ఈ చాప్టర్ నుంచి తొలగించిన భాగాల్లో, చార్లెస్ రాబర్ట్ డార్విన్, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, మాలెక్యులార్ ఫైలోజెనీ, ఇవల్యూషన్, ట్రేసింగ్ ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ వంటివి ఉన్నాయి.