Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో నలుగురికి తిరస్కరణ : సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గుజరాత్‌లోని గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో వీరు 17 ఏండ్ల నుంచి దోషులుగా జీవిత ఖైదును అనుభ విస్తున్నారు. అయితే, ఇదే కేసుకు సంబంధించి మరో నలుగురు దోషుల పాత్రను గుర్తించిన న్యాయస్థానం.. వారికి మాత్రం బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. 2002, ఫిబ్రవరి 27న సబర్మతి రైలు ఎస్6 కోచ్‌కు గోద్రా స్టేషన్లో దుండగులు నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 59 మంది మరణించారు. దీంతో ఈ ఘటన అప్పట్లో గుజరాత్లో తీవ్ర మత ఘర్షనలకు దారి తీసింది. ఫలితంగా అధికారిక లెక్కల ప్రకారం 1044 మంది వ్యక్తులు చనిపోయారు. ఈ కేసులో దోషులకు విధించిన మరణశిక్షను 2017లో గుజరాత్ హైకోర్టు యావజ్జీవ శిక్షకు తగ్గించింది. మరో 20 మందికి విధించిన జీవిత ఖైదు శిక్షను సమర్ధించింది. ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి.ఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించి 8 మంది దోషులకు బెయిల్‌ను కల్పించింది. వారు 17 ఏండ్ల పాటు జైలులో గడిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే, ప్రస్తుత దశలో మరో నలుగురు దోషులకు మాత్రం బెయిల్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ నలుగురు దోషులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.