Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలిట్‌బ్యూరో సంతాపం
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మదన్ ఘోష్ శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ టౌన్లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. మదన్ ఘోష్ మృతి పట్ల సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. 1959లో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీలో మదన్ ఘోష్ సభ్యుడిగా చేరారు. 1960, 1970 దశకాల్లో పశ్చిమ బెంగాల్లో సెమీ-ఫాసిస్ట్ శక్తులు రాష్ట్రాన్ని పరిపాలి స్తున్నప్పుడు, రెండున్నరేండ్లపాటు అజ్ఞాతంలో ఉండి కూడా పార్టీ వైపునకు ప్రజలను సమీకరించడంలో మదన్ ఘోష్ చాలా చురుకుగా పనిచేశారు. 1992లో పార్టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యులుగానూ, 2002లో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ ఎన్నికయ్యారు. 2008లో కోయిం బత్తూర్లో జరిగిన పార్టీ కాంగ్రెస్‌లో కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. వ్యవసాయ ఉద్యమంలోనూ మదన్ ఘోష్ నాయకుడిగా ఉన్నారు. ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. పిబికెఎస్ రాష్ట్ర అధ్యక్షు లుగానూ, ఎఐకెఎస్ ఉపాధ్యాక్షులుగానూ పనిచేశారు. అలాగే బుర్ద్వాన్ జిల్లా పరిషద్ సభాదిపతిగా కొంతకాలం సేవలు అందించారు. నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్-లెనినిస్ట్‌గా మదన్ ఘోష్ ప్రసిద్ధి చెందారు. వినయం, ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిఉండేవారు. మదన్ ఘోష్ భార్య, కుటుంబ సభ్యులకు పొలిట్ బ్యూరో హృదయపూర్వక సానుభూతిని తెలియచేసింది.
జమ్మూ ఉగ్రదాడిని ఖండించిన సీపీఐ(ఎం)
జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్లో భింబర్ గాలి- పూంచ్ మధ్యలో సైన్యం వాహనంపై జరిగిన ఉగ్రదాడిని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు తమ ప్రాణాలు కోల్పో యారు. అన్ని రకాల ఉగ్రవాదంపై మన పోరాటంలో రాజీ ఉండ కూడదని పొలిట్ బ్యూరో స్పష్టం చేసింది.