Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు ప్రభుత్వ తీరును ఖండించిన సీఐటీయూ
- 'పని గంటల' నిబంధనలు తొలగించడానికేనని ఆరోపణ
చెన్నై : ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన ఫ్యాక్టరీల (తమిళనాడు సవరణ) చట్టం, 2023 ను సీఐటీయూ ఖండించింది. సదరు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనను విడుదల చేశారు. దీని ప్రకారం.. తమిళనాడు ప్రభుత్వ తీరును సీఐటీయూ ఖండించింది. ఇది కార్మిక వ్యతిరేక, యాజమాన్య అనుకూల చట్టం. ఏదైనా ఫ్యాక్టరీ, గ్రూపు, తరగతులను ఫ్యాక్టరీల చట్టం, 1948లోని పని గంటల నిబంధనల నుంచి మినహాయించే అధికారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి కల్పిస్తుంది. తద్వారా ఆ నియంత్రణ నిబంధనలన్నింటిని ఏకపక్షంగా ఉల్లంఘించేలా యజమానికి బహిరంగంగా అధికారం కల్పించి, కార్మికులను అమానవీయ బానిసత్వంలో ఉంచుతుంది.
ఇలాంటి భారీ స్థాయి మినహాయింపు విధానం అనివార్యంగా పని దినంలో పని గంటలను పెంచుతుంది. పని గంటలు, పని దినాలను ఏకపక్షంగా క్రమబద్దీకరించే విధానం ద్వారా కార్మికుల వేతనాలు, సంపాదనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలోని కార్మికులకు ఇది వినాశకరమైనది. ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి అనుమతించకూడదు. కార్మికులు, సీఐటీయూ అనుబంధ సంస్థలు ఈ చట్టాన్ని ఐక్యంగా వ్యతిరేకించాలి. రాష్ట్రస్థాయిలో, పని ప్రదేశాలలో ఉమ్మడి నిరసన చర్యల ద్వారా దుర్మార్గమైన కార్పొరేటు అనుకూల రూపకల్పనను బహిర్గతం చేయాలనీ,అంతర్జాతీయంగా ప్రశంసలు, గుర్తింపు పొందిన శ్రామికుల 8 గంటల పని విధానాన్ని రక్షించుకోవాలి.