Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో పాటు ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన సుమారు 25 మంది రైతు సంఘాల నేతలను ఢిల్లీ పోలీసులు శనివారం నిర్బంధించినట్లు తెలిసింది. రైతు సంఘాల నేతలతో పాటు మాలిక్ కూడా ఆర్.కె. పురమ్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న దృశ్యాలను వివిధ వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి. హర్యానా, ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన సుమారు 250 నుండి 300 మంది మద్దతుదారులతో సహా పలువురు రైతు సంఘాల నేతలు మధ్యాహ్నం 12.30కి ఢిల్లీలోని మాలిక్ నివాసానికి చేరుకున్నారు. మాలిక్ తమను విందుకు ఆహ్వానించారని, అందుకే అక్కడికి చేరుకున్నామని వారు పేర్కొన్నారు. మాలిక్ తన ఇంటికి సమీపంలోని పార్క్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే నివాస ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదంటూ వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మాలిక్ మద్దతుదారులు తెలిపారు.
అయితే సత్యపాల్ మాలిక్‌ను తాము నిర్బంధించలేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం. మాలిక్, రైతు సంఘాల నేతలను విడుదల చేస్తేనే తాము స్టేషన్ వదిలి వెళతామని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆందోళన చేపట్టిన మద్దతుదారుల్లో ఒకరు మీడియాతో పేర్కొన్నారు. మోడీది అవినీతి ప్రభుత్వమని, పుల్వామా ఘటనపై మాలిక్ వాస్తవాలే చెప్పారని ఆయన అన్నారు.
పుల్వామా ఉగ్రవాద ఘటనలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వైఫల్యాలపై నోరు విప్పవద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీ తనకు చెప్పారని సత్యపాల్ మాలిక్ ఇటీవల మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలయన్స్ ఇన్సూరెన్స్ అంశంపై మాలిక్‌పై సిబిఐ దాడికి దిగిన సంగతి తెలిసిందే. బిజెపి నేత అయిన మాలిక్ జమ్ముకాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు. జమ్ముకాశ్మీర్‌లో బీమా పథకాన్ని ప్రారంభించేందుకు రిలయన్స్ ఇన్సూరెన్స్‌కు తాను మొదట అనుమతిని నిరాకరించానని సత్యపాల్ మాలిక్ మీడియాకు వివరించారు. అయితే ఆర్ఎస్ఎస్, బిజెపి నేత రామ్ మాధవ్ తనపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆయన చెప్పారు. ఈ పథకంతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు.