Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నలకు జవాబేది ?
- ప్రశ్నిస్తే ఎదురుదాడేనా?
- పుల్వామాపై నేటికీ పెదవి విప్పని మోడీ ప్రభుత్వం
ప్రభుత్వ రక్షణ లేకుండా రెండున్నర వేల మంది సైనికులు ఆ రోడ్డు మీదుగా ఎందుకు ప్రయాణించారు? ఉగ్రవాద దాడి జరుగుతుందని ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఏమైనా ఉన్నదా? సైనికులను విమానాల ద్వారా తరలించేందుకు ఎందుకు నిరాకరించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి లేదా? వాస్తవాన్ని చెప్పేందుకు నిరాకరించడం అంటే ప్రజాస్వామ్య సూత్రాలను నీరుకార్చడమే అవుతుంది.
జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరిలో జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అమర వీరులకు దేశమంతా ఘనంగా నివాళులు అర్పించింది. పుల్వామాలో జరిగిన ఈ దారుణానికి కారణమెవరు ? సీఆర్పీఎఫ్ జవాన్లను కాపాడుకోవడంలో ఎందుకు విఫలమయ్యాం? వంటి ప్రశ్నలు ఆనాడే తలెత్తాయి. అయినా వీటికి పాలకులు సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన జరిగి నాలుగు సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ ప్రశ్నలకు జవాబులు లేవు. మౌనమే బీజేపీ ప్రభుత్వ సమాధానం అవుతోంది.
న్యూఢిల్లీ : పుల్వామా ఘటన జరిగిన సమయంలో జమ్మూకాశ్మీర్ గవర్నర్గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ ఇప్పుడు ఆ తేనెతుట్టెను మళ్లీ కదిలించారు. ఆయన లేవనెత్తిన అంశాలు దేశ భద్రత, ప్రభుత్వ సమర్ధతకు సంబంధించి అనేక తీవ్రమైన ప్రశ్నలను జాతి ముందు ఉంచాయి. అయినప్పటికీ ప్రభుత్వం అప్పటి మాదిరిగానే ఇప్పుడూ మౌనాన్ని ఆశ్రయించడం దేశ ప్రజలను ఆందోళనకు, కలవరపాటుకు గురిచేస్తోంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అంశంపై ఎలక్ట్రానిక్ మీడియా కూడా నోరు విప్పకపోవడం మరింత ఆందోళన కలిగించే విషయం. పుల్వామా ఘటనను ఏ విధంగా నివారించి ఉండేవారమో సత్యపాల్ మాలిక్ స్పష్టంగా చెప్పారు. సైనికుల భద్రతను ఫణంగా పెట్టి ఉండకపోతే ఈ సంఘటన జరిగి ఉండేదే కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా కన్పించే ప్రాంతంలో...మనుష్య సంచారం లేని రోడ్డు మీద...సైనిక వాహనాలు పెద్ద సంఖ్యలో ప్రయాణించడాన్ని ఆయన తప్పుపట్టారు. జవాన్ల కోరిక మేరకు వారిని విమానాలలో తరలించి ఉంటే ఈ ముప్పు జరిగేదే కాదని సత్యపాల్ చెప్పారు. ఆయన చెప్పిందే నిజమైతే తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు, సైనికుల భద్రత విషయంలో దాని అలసత్వం తేటతెల్లమవుతున్నాయి.
పుల్వామా ఘటనలో కేంద్రం వైఫల్యాన్ని సత్యపాల్ మాలిక్ ఎండగట్టగానే బీజేపీ నాయకులంతా ఆయనపై ముప్పేట దాడి మొదలు పెట్టారు. ఆయన విశ్వసనీయతను ప్రశ్నించారు. అంతేకానీ ఆయన చెప్పింది అవాస్తవమని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. లేదా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసి ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలూ ఇవ్వలేదు. అవి సత్యపాల్ వేసిన ప్రశ్నలు మాత్రమే కాదు... దేశంలోని ప్రతి పౌరుడు సంధించిన ప్రశ్నలు. అయినప్పటికీ దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదు. చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహరించింది. 'నోరు విప్పవద్దు' అంటూ ఆనాడు సత్యపాల్కు ప్రధాని మోడీ హుకుం జారీ చేశారు. ఇప్పుడు దేశంలో లోపించిన పారదర్శకత విషయంలో ప్రశ్నించినా కేంద్రం అదే మాట చెబుతోంది. దేశ భద్రత, ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మాట్లాడకుండా సత్యపాల్ నోరు మూయించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని చూస్తుంటే అసలు ఆ విషయాలకు అది ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది అర్థమవుతుంది. ఎన్నికలలో విజయం సాధించడం ఒక్కటే దాని లక్ష్యం. నెపాన్ని గవర్నర్ పైన నెట్టి, జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం అనేవి ప్రజాస్వామ్యంలో
అత్యంత ఆవశ్యకమైన విషయాలు. ప్రభుత్వం నుంచి ప్రజలకు సమాచారం లభించకపోవడం ప్రజాస్వామ్య వైఫల్యంగానే భావించాలి. కొన్ని విషయాలలో గోప్యత అవసరమే అయినప్పటికీ సాయుధ దళాల రక్షణలో ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడం సరికాదు. పాలనలో పారదర్శకత ఉండాలన్నా, ప్రజలకు అవసరమైన సమాచారం లభించాలన్నా పార్లమెంట్ అనేది చాలా కీలకం. కానీ దురదృష్టవశాత్తూ రక్షణ, భద్రతకు సంబంధించి ఎంపీలు ఎంతగా అరచి గీపెట్టినా పాలకులు పెడచెవిన పెడుతున్నారు. పుల్వామా ఘటనపై విచారణ జరిపించాలని ఎంపీలు డిమాండ్ చేసినప్పటికీ ఈ వ్యవహారం దర్యాప్తులో ఉన్నదని చెబుతూ సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ దాడిపై ఇప్పటివరకూ సవివరమైన నివేదిక ఏదీ బయటకు రాలేదు. విచారణ ఎంత వరకూ వచ్చిందో కూడా తెలియడం లేదు. పుల్వామా దుర్ఘటన జరిగి నాలుగేండ్లు దాటినా ఆ హృదయవిదారకమైన దృశ్యాలు నేటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో తన ప్రమేయం ఏమిటో బయటపెట్టేందుకు మోడీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది.