Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకాలను మేమే స్వతంత్రంగా ముద్రిస్తాం
- కేరళ ఎల్లప్పుడూ లౌకిక, రాజ్యాంగ విలువలను కాపాడుతుంది : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శివన్కుట్టి
న్యూఢిల్లీ : నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) తొలగించిన పాఠ్యాంశాలను బోధించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే తామే పుస్తకాలను స్వతంత్రంగా ముద్రించుకుంటామని కేరళ విద్యా శాఖ మంత్రి వి శివన్కుట్టి అన్నారు. కేరళ ఎల్లప్పుడూ లౌకిక, రాజ్యాంగ విలువలను కాపాడుతుందన్నారు. ఎన్సీఈఆర్టీ తొలగించిన పాఠ్యాంశాలను బోధించాలని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠశాల పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని భాగాలను మినహాయించాలనే నిర్ణయంపై రాజుకున్న వివాదం మధ్య కేరళ విద్యా శాఖ మంత్రి వి శివన్కుట్టి మాట్లాడారు. కొచ్చిలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ మొఘల్ శకం, గుజరాత్ అల్లర్ల వంటి చరిత్రలోని కొన్ని భాగాలను పాఠ్యపుస్తకాల నుంచి వదిలివేయడం తప్పు అన్నారు. రాజకీయ మార్గాలకు అనుగుణంగా చరిత్రను మార్చే చర్యను ఆయన ఖండించారు. 'ఎన్సీఈఆర్టీ చేసిన పని మాకు ఆమోదయోగ్యం కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రం తన ఆలోచనలను ఇలా రాష్ట్రాలపై రుద్దడానికి వీల్లేదు. మేం ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సి వస్తుంది' అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎన్సీఈఆర్టీ బోర్డును కేంద్రం పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలను తొలగించే చర్యను తప్పుపడుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 'పాఠ్యపుస్తకాల నుంచి వాటిని తొలిగించడంతో చారిత్రక వాస్తవాలను మీరు తిరస్కరించలేరు. సంఫ్‌ు పరివార్ తన అసలు రంగును బయటపెడుతున్నది. చరిత్రపై నిరంతరం భయంతో సంఫ్‌ు పరివార్ జీవిస్తోంది. వారు చరిత్రను తిరగరాయడానికీ, అబద్దాలతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు' అని విజయన్ తెలిపారు. 'పాఠశాల పుస్తకాలను కాషాయీకరణ చేయడం ఈ చర్య వెనుక అసలు లక్ష్యం. అన్ని ప్రజాస్వామ్య శక్తులు దీనిని వ్యతిరేకించాలి' అని ఆయన పేర్కొన్నారు.