Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షా వాదనలో డొల్లతనం
- పదవిలో ఉండగానే గళం విప్పిన సత్యపాల్ మాలిక్
- పుల్వామా దాడి ఇంటెలిజెన్స్ వైఫల్యమంటూ విమర్శ
- బీజేపీ సర్కారుపై అవినీతి ఆరోపణలు
తమ ప్రభుత్వంపై జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్
సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. సత్యపాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడే ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అయితే వాస్తవాలను పరిశీలిస్తే అమిత్ షా వాదనలో డొల్లతనం బయటపడుతుంది. సత్యపాల్ పదవిలో ఉండగా మౌనం వహించారన్న వాదనలో పసలేదని అర్థమవుతోంది. వాస్తవానికి ఆయన గవర్నర్‌గా ఉన్నప్పుడే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.
పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిన మర్నాడే సత్యపాల్ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని చెప్పారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని కానీ, అది రోడ్లపై తిరగడాన్ని కానీ భద్రతాదళాలు కనిపెట్టలేక పోయాయని తెలిపారు. 'ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని మనం అంగీకరించం. రహదారిపై పేలుడు పదార్థాల వాహనం తిరుగుతుంటే దానిని గుర్తించం. నిరోధించం. మనం తప్పు చేశామన్న విషయాన్ని అంగీకరించాలి' అని అన్నారు.
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళం బాలాకోట్‌పై జరిపిన దాడి, దానికి మీడియా ఇచ్చిన విస్తృత ప్రచారం... పుల్వామాలో భద్రతా వైఫల్యాన్ని కప్పిపెట్టింది. బాలాకోట్ దాడిని మోడీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారు. లాతూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ మొట్టమొదటిసారి ఓటు వేస్తున్న యువతకు పుల్వామా మరణాలు, బాలాకోట్ దాడిని గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన కొన్ని నెలల తర్వాత 2019 నవంబర్‌లో మాలిక్‌ను గోవా గవర్నర్‌గా పంపారు. 2020 ఆగస్ట్‌లో ఆయనను మేఘాలయకు గవర్నర్‌గా నియమించారు. 2021 అక్టోబర్‌లో మేఘాలయ గవర్నర్‌గా ఉన్నప్పుడు ది వైర్ పత్రిక కోసం కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ ప్రభుత్వంపై మాలిక్ అవినీతి ఆరోపణలు చేశారు. రెండు ఫైళ్లకు ఆమోదం తెలపడానికి తనకు
రూ. 300 కోట్ల ముడుపులు ఇవ్వజూపారని ఆయన తెలిపారు. అందులో ఒక ఫైలు ఆర్ఎస్ఎస్ నాయకుడికి చెందినది. ఝంజునూలో, రాజస్థాన్‌లో చేసిన ప్రసంగాలలో కూడా ఆయన ఇదే ఆరోపణను పునరుద్ఘాటించారు. మాలిక్ ఆరోపణకు మీడియా విస్తృత ప్రచారం కల్పించింది కూడా. మాలిక్ ఆరోపణల అనంతరం సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. 2022 ఏప్రిల్‌లో 22 ప్రాంతాలలో సోదాలు చేసింది. ఈ రెండు కేసులకు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్జీఐసీ), చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులపై కేసులు పెట్టింది.
2022 జనవరిలో హర్యానాలోని దాద్రీలో జరిగిన సభలో మాలిక్ మరో బాంబు పేల్చారు. రైతుల ఆందోళన గురించి మోడీతో మాట్లాడేందుకు వెళ్లినప్పుడు తనతో వాదనకు దిగారని, ఆయన అహంకారి అని విమర్శించారు. 'ఆయన చాలా అహంకారి. ఐదు వందల మంది రైతులు చనిపోయారని నేను ఆయనకు చెబితే వాళ్లు నా కోసం చనిపోయారా అని ప్రశ్నించారు. ఒక కుక్క చనిపోతేనే మీరు సంతాప సందేశం పం పారని ఆయనకు గుర్తు చేశాను. మీరు దేశానికి నాయకుడు కనుక రైతులు మీ కోస మే చనిపోయారని చెప్పాను. అప్పుడు ఆయన నాతో వాగ్వివాదానికి దిగారు. అమిత్‌షాను కలవాలని నాకు చెప్పారు.అలాగే కలిశాను' అని మాలిక్ వివరించారు.
గవర్నర్ పదవి నుండి వైదొలిగిన తర్వాత
మాలిక్ మేఘాలయ గవర్నర్‌గా ఉన్నప్పుడే ది వైర్‌కు మరో ఇంటర్వ్యూ ఇచ్చారు. అది 2022 సెప్టెంబర్ 15న ప్రచురితమైంది. ప్రధాని మోడీని మహా ఉన్మాదిగా మాలిక్ అభివర్ణించారు. అమిత్ షా వాస్తవిక దృక్ఫథంతో వ్యవహరిస్తారని, అయితే మోడీ ఆయనకు స్వేచ్ఛ ఇవ్వరని చెప్పారు. ప్రభుత్వ కేంద్రీకృత స్వభావాన్ని గురించి కూడా మాలిక్ ప్రస్తావించారు. నితిన్ గడ్కరీకి దేశంలో మంచి పేరు ఉన్నదని అంటూనే ఆయన కానీ, రాజ్‌నాథ్ సింగ్ కానీ మంచి పనులు చేసినా వారికి గుర్తింపు లభించదని చెప్పారు. పేరంతా మోడీకి వెళుతుందని అన్నారు. 2022 అక్టోబర్ 6న...అంటే గవర్నర్ పదవి నుండి వైదొలిగిన రెండు రోజుల తర్వాత గతంలో ప్రస్తావించిన రెండు అవినీతి కేసులకు సంబంధించి సీబీఐ ఆయనను ప్రశ్నించింది.