Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు కర్నాటక ప్రభుత్వం క్లీన్చిట్
- మొత్తం వెయ్యి మంది నేరస్థులు
బెంగళూరు : కర్నాటకలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్రిమినల్ కేసుల ఉపసంహరణ విషయంలో ఎంతో 'ఉదారత్వాన్ని' ప్రదర్శించింది. 2019 జూలై నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకూ మొత్తం 385 క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంది. వీటిలో 182 కేసులు విద్వేషపూరిత ప్రసంగాలకు, గో సంరక్షణ పేరిట జరిగిన హింసకు, మతపరమైన హింసాకాండకు సంబంధించినవి. ప్రభుత్వ నిర్ణయం కారణంగా వెయ్యి మంది నేరస్థులు ప్రయోజనం పొందారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఆర్టీఐ ద్వారా రాష్ట్ర హోం శాఖ నుంచి ఈ సమాచారాన్ని పొందింది. క్రిమినల్ కేసులలో విచారణను నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి, ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్యకాలంలో ఏడుసార్లు ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరిలో మొదటిసారి జారీ చేసిన ఆదేశాలలో రైతుల నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించారు. మిగిలిన ఆరు ఆదేశాలలోనూ సగం మతహింసకు చెందినవే. వీటి ద్వారా ప్రయోజనం పొందిన వారిలో ఓ బీజేపీ ఎంపీ, మరో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. 2020 ఫిబ్రవరి-ఆగస్ట్ నెలల మధ్య ఉపసంహరించుకున్న కేసుల కారణంగా మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ, బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సహా పలువురు ప్రజాప్రతినిధులు బయటపడ్డారు.
మతహింసకు సంబంధించిన 182 కేసులలోనూ 45 కేసులు ఉత్తర కన్నడ జిల్లాలో 2017 డిసెంబరులో జరిగినవి. ఈ కేసులలో 200 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. టిప్పు సుల్తాన్ జయంతి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వినాయక చవితి పండుగలకు సంబంధించిన కేసులు కూడా వీటిలో ఉన్నాయి. ఉపసంహరించుకోవడానికి అనువైనవి కావంటూ ప్రాసిక్యూషన్, న్యాయ మంత్రిత్వ శాఖ అభ్యంతరం చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అక్టోబర్లో 34 కేసులు వెనక్కి తీసుకుంది. హిందూ జాగరణ వేదిక, శ్రీరామసేన నాయకులపై నమోదైన కేసులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అనేక కేసులు న్యాయస్థానాల్లో పదేండ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్నాయని, అందుకే వీటిని ఉపసంహరిం చుకున్నామని హోం మంత్రి జ్ఞానేంద్ర తెలిపారు. జనవరి 2020, 2023 మధ్య నమోదైన 105 విద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో 55 కేసులో ఒక్క బెంగళూరు నగరంలో నమోదైనవే.