Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్ షా వ్యాఖ్యలో ఆంతర్యం అదే
- నిబంధనలు, సంప్రదాయాలకు పాతర
- రెచ్చగొట్టే మాటలతో ఓట్లు దండుకునే ప్రయత్నం
'ఎన్నికల ప్రక్రియలో మతానికి ఎలాంటి పాత్ర లేదు. అది ఒక లౌకిక విధి' అంటూ 2017లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ ధర్మాసనానికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వం వహించారు. మతం, కులం పేరుతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి చర్య అవుతుందని ఆయన ఆ తీర్పులో స్పష్టం చేశారు. కానీ కేంద్ర హోం మంత్రి ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు.
ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి వాటిని ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు ఇచ్చే పేరిట అమిత్ షా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇది మత ప్రాతిపదికన ఓటర్ల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. బీజేపీకి ఓట్లు అభ్యర్థిస్తూ కేంద్ర హోం మంత్రి పలు నిబంధనలు, సంప్రదాయాలను తుంగలో తొక్కారు. ఇది మతాల మధ్యేకాదు, కులాల మధ్య కూడా కుంపటి రాజేసే ప్రయత్నం.
న్యూఢిల్లీ : తెలంగాణలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లకు చెల్లుచీటీ పలుకుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం చేవెళ్లలో జరిగిన బీజేపీ విజరు సంకల్ప్ సభలో సెలవిచ్చారు. 'రెండు పడకగదుల ఇళ్లలోనూ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కు. వారికి రిజర్వేషన్లు కల్పించి, ముస్లింలకు తొలగిస్తాం' అని కూడా చెప్పుకొచ్చారు.
ఓబీసీలకు రిజర్వేషన్లు కులం ఆధారంగా కల్పించేవి కావు. అవి సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా కల్పించేవి. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులను కూడా ఓబీసీలుగా పరిగణిస్తున్నారు. ఏ సామాజిక తరగతికైనా విద్య, వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురవుతున్న వారిని ఈ రిజర్వేషన్ల పరిధిలో చేర్చారు. ఈ నేపథ్యంలో ముస్లింలను, ఓబీసీలను వేర్వేరుగా చూడడం పొరబాటు.
తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఏదీ ఇప్పుడు అమలులో లేదు. అయితే అమిత్ షా మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్లోగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. అలా చెప్పడం ద్వారా ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నేరుగా ఉల్లంఘించారు. ఎలా అంటే ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో 'సాధారణ ప్రవర్తనా నియమావళి' నిబంధనలోని ఐటమ్ నెం. 1 ఇలా చెబుతోంది....ఏ పార్టీ కానీ, అభ్యర్థి కానీ వేర్వేరు కులాలు, సమాజాలు, భాషలు, మతాల మధ్య విభేదాలను మరింత పెంచడం కానీ, వాటి మధ్య పరస్పరం విద్వేషాన్ని రగిలించడం కానీ లేదా ఉద్రిక్తతలను ప్రేరేపించడం కానీ చేయకూడదు...కానీ అమిత్ షా చేసిందేమిటి ? ఒకరి ప్రయోజనాలు లాగేసుకొని వేరొకరికి కల్పించాలని ఆయన కోరుకున్నారు.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ముస్లింలకు లభిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను గత నెలలో తొలగించింది. ఆశ్చర్యకరమైన, అభ్యంతరకరమైన విషయమే మంటే ఆ నాలుగు శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అణగారిన కులాలకు కాకుండా, శక్తివంతమైన కులాలుగా చెలామణి అవుతున్న లింగాయతులు, ఒక్కలిగుల మధ్య సమానంగా పంచింది. దీంతో వారి రిజర్వేషన్లు ఐదు శాతానికి, ఏడు శాతానికి చేరాయి. ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కింద చేర్చారు. ఆ వర్గాలకు ప్రస్తుతం మొత్తంగా పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. జైనులు, బ్రాహ్మణులు సహా పలు కులాలతో కలిసి ముస్లింలు వాటిని పంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ముస్లింలను మాత్రమే 2బీ కేటగిరీ నుంచి తొలగించారు. మిగిలిన మైనారిటీలందరూ అందులోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఇప్పటికే ఇద్దరు సభ్యుల బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో తన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం మరికొంత సమయం కోరింది. విధిలేని పరిస్థితుల్లో ఎన్నికలు ముగిసేంత వరకూ రిజర్వేషన్లపై ఎలాంటి చర్యలూ చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లపై హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. న్యాయస్థానాలు, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర సంస్థలు కఠిన చర్యలు తీసుకోగలిగితే కేంద్ర హోం మంత్రి చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు.