Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్ణాటకలో ఐటి, లోకాయుక్త దాడులు
బెంగళూరు : మే 10న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతున్న వేళ సోమవారం ఆదాయపు పన్ను, లోకాయుక్త దాడులు జరగడం కలకలం సృష్టించింది. మాజీ మంత్రి కె. గంగాధర గౌడ, అతని కుమారుడు- బెల్తంగడి కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు రంజన్ జి. గౌడ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. బెల్తంగడి, దాని సమీప గ్రామం ఇన్దబెట్టులోని ఉన్న ఈ ఇద్దరు నాయకులు నివాసాల్లో ఈ దాడులు జరిగాయి. అలాగే ప్రసన్న ఎడ్యుకేషన్ ట్రస్టు కార్యాలయంపైనా దాడులు జరిగాయి. ఈ ట్రస్టు ద్వారా గంగాధర గౌడ, రంజన్ గౌడ అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో ఐటి అధికారులు ఈ దాడులు జరిపారు. క్రీడా, యువజన శాఖ మంత్రిగా పనిచేసిన గంగాధర గౌడ 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తరువాత కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా 2008 ఎన్నికల్లో మాత్రం జెడి(ఎస్) అభ్యర్థిగా పోటీ చేశారు. రంజన్ గౌడ 2013 ఎన్నికల్లో బిజెపి తరుపున పోటీ చేసి ఓటమి చెందాడు. 2019లోకాంగ్రెస్లో చేరారు. గంగాధర గౌడ, రంజన్ జి. గౌడ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులను కాం గ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు రాజకీయ ప్రేరేపిత చర్య అని బెల్తంగడి కాంగ్రెస్ అభ్యర్థి రక్షిత్ శివరామ్ విమర్శించారు. నియోజక వర్గం లో కాంగ్రెస్కు వస్తున్న మద్దతు చూసి అధికార బిజెపి ఆందోళన చెందు తుందని ఆరోపించారు. ఎఐసిసి అధికార ప్రతినిధి చరణ్ సింగ్ సప్రా మాట్లాడుతూ ఈ దాడులను చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.
అధికారులపై లోకాయుక్త దాడులు
కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో అధికారులపై లోకాయుక్త పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. అక్రమాస్తుల కేసులు నమోదు చేశారు. బెంగళూరు, శివమొగ్గ, చిత్రదుర్గ, కోలార్, బీదర్ జిల్లాలో ఈ దాడులు జరిగాయి. బెంగళూరులో బిబిఎంపి యెలహంక జోన్ టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ గంగాధరయ్య కార్యాలయం, నివాసంపై దాడులు జరిగాయి. సోమవారం మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు లోకాయక్త పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.