Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందస్తు బెయిల్ ఉత్తర్వులు నిలిపివేత
- తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- సీబీఐ నిర్దేశించిన రీతిలోనే దర్యాప్తు చేయాలి
న్యూఢిల్లీ : వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను సీబీఐ అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేసింది. అంతేకాదు విచారణలో లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని నిర్దేశించిన రీతిలోనే దర్యాప్తు చేయాలని ఆదేశించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డివై చండ్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి ప్రింటెడ్ ప్రశ్నలను అందించాలని సీబీఐని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం కొట్టివేసింది. ఇటువంటి ఆదేశాలు తీవ్ర పక్షపాత దర్యాప్తుకు సంబంధించినవని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీబీఐ విచారణకు గడువు పెంపు
అంతేకాదు ఏప్రిల్ 30 నాటికి విచారణ ముగించాలని గతంలో ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు పెంచింది. జూన్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. హైకోర్టు బెయిల్‌పై తేల్చేంత వరకు అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది కోరగా.. ఈ విజ్ఞప్తిని సుప్రీం అంగీకరించలేదు. అవినాష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని, దర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా ఉన్నాయని సీజేఐ ధర్మాసనం పేర్కొంది.