Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణ చట్టం ఏది ?
- అడ్డూఅదుపూ లేని ఉల్లంఘనలు
- భారత్‌లో పరిస్థితిపై ఐఎంఎఫ్
దేశంలో డిజిటల్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. 2009లో ఆధార్ వ్యవస్థను ప్రారంభించారు. వ్యక్తుల వ్యక్తిగత సమాచారం మొత్తం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు ప్రతి దానికీ ఆధార్ అవసరమవుతోంది. అలాంటప్పుడు ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచకపోతే కోట్లాది మంది ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. సమాచార రక్షణ చట్టం అందుబాటులో లేకుంటే వ్యక్తుల సమాచారం తేలికగా బహిర్గతమవుతుంది.
సమగ్ర చట్టమేదీ అందుబాటులో లేకపోవడంతో దేశంలో సామాజిక భద్రతా వ్యవస్థ, సబ్సిడీ కార్యక్రమాలకు చెందిన సమాచారం మొత్తం బయటకు పొక్కుతోంది. దీనివల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. ఉదాహరణకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)నే తీసుకుందాం. ఇందులో ఎంత అవినీతి జరుగుతోందో చెప్పనక్కరలేదు. అసలైన లబ్ధిదారుల స్థానంలో వేరే వారిని ఎంపిక చేయడం, అమ్మకాలు సరిగా చేయకపోవడం, గోధుమలు-బియ్యాన్ని దారి మళ్లించడం వంటి చర్యల కారణంగా ఈ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. సమగ్ర సమాచార రక్షణ చట్టాన్ని రూపొందిస్తే ఇలాంటి అవకతవకలకు అడ్డుకట్ట వేయవచ్చు.
న్యూఢిల్లీ : భారత్‌లో నేటికీ వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు, దానిని పరిరక్షించేందుకు సమగ్ర చట్టమేదీ అమలులో లేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. దీనివల్ల వినియోగదారుల గోప్యత, డిజిటల్ హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఐఎంఎఫ్ ఒక పత్రాన్ని విడుదల చేసింది. వినియోగదారుల సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వాలు సేకరించి ఉపయోగించుకునే అవకాశం లేకుండా చట్టాన్ని రూపొందించాలని సూచించింది. అంతేకాక అలాంటి కంపెనీలు, ప్రభుత్వాలను బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. ఈ పత్రాన్ని ఇటీవల ప్రచురించారు.
వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం ప్రాథమిక హక్కు అని, ఇందుకోసం ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించి అమలు చేయాలని 2017లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటి నుంచి రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం సమాచార రక్షణ కోసం చట్టాన్ని మాత్రం రూపొందించలేదు. దీనివల్ల పౌరులు గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కును కోల్పోతున్నారు. తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే అవకాశం లేకపోవడం వల్ల 2021లో ఎనిమిది కోట్ల మంది ప్రజలకు నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఈ అవకాశం లేని దేశాల జాబితాలో ఆ సంవత్సరం భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఎయిర్ ఇండియా, డొమినో, ఫేస్బుక్, మొబిక్విక్, అప్స్టోక్ వంటి పేరున్న సంస్థలు వినియోగదారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు, పాస్‌పోర్టులు, ఆధార్ వంటి సమాచారాన్ని సేకరించి ఉల్లంఘనలకు పాల్పడ్డాయి.
ఇలాంటి ఉల్లంఘనల కారణంగా ప్రతి సంవత్సరం ఎంత మేర నష్టం జరుగుతోందో ఐబీఎం అంచనా వేసింది. 2021లో సమాచార చౌర్యం కారణంగా దేశంలోని వినియోగదారులు 22 లక్షల డాలర్ల మేర నష్టపోయారు. ప్రపంచ దేశాలలో 42.4 లక్షల డాలర్ల మేర సమాచార చౌర్యం జరిగిందని ఐబీఎంను ఉటంకిస్తూ ఐఎంఎఫ్ తెలిపింది. తమ సమాచారం చౌర్యానికి గురవుతుండడంతో వినియోగదారులకు డిజిటల్ మాధ్యమాలపై విశ్వాసం పోతోందని ఐఎంఎఫ్ పత్రం అభిప్రాయపడింది.
2012లో పీడీఎఫ్‌పై పెట్టిన ఖర్చులో 36 శాతం వరకూ అసలైన లబ్ధిదారులకు చేరనేలేదు. అనర్హులను లబ్ధిదారులుగా చేర్చడం, సబ్సిడీ సరుకులను డీలర్లు అక్రమంగా పక్కదారి పట్టించడం దీనికి కారణం. ఈ నేపథ్యంలో సామాజిక భద్రతా పథకాలను మరింత ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నదని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. కోవిడ్ తర్వాత ఈ పథకాలలో చేరిన వారి సంఖ్య బాగా పెరిగింది. అయినప్పటికీ అర్హులైన మహిళలలో సగం మందికి ఇవి ఇంకా చేరలేదు. అందువల్ల మరింత మందిని గుర్తించి వారిని సామాజిక భద్రతా పథకాలలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా సమాచార గోప్యతకు సంబంధించి సమగ్ర చట్టం రూపొందించాల్సి ఉంది.
డిజిటల్ కార్యకలాపాలకు సంబంధించి దేశం గణనీయమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ దానిపై ప్రజలలో అవగాహన చాలా తక్కువగా ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. ఉదాహరణకు యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినప్పటికీ దేశంలో 15 సంవత్సరాల పైబడిన వారిలో కేవలం 35 శాతం మంది మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. వృద్ధులు, పేదలలో డిజిటల్ అక్షరాస్యత మరింత తక్కువగా ఉంటోంది. దీనిని పెంచడంతో పాటు వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.