Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బృందా కరత్, మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా తదితరుల సంఘీభావం
- రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవే : సుప్రీం కోర్టు
- రెజ్లర్ల పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులకు నోటీసులు
- రేపు దేశవ్యాప్త నిరసనకు ఐదు సంఘాల పిలుపు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఎస్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు వెల్లువెత్తింది. మేఘాలయా మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్, మాజీ ఎంపీ, ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లా, రాజ్యసభ ఎంపీ, డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఎఎ రహీం, కిసాన్ నేత రాకేష్ టికాయిత్, రెజ్లర్ గీతా ఫోగట్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తదితరులు మద్దతు తెలిపారు.
మీ స్పందనేంటి? : ఢిల్లీ పోలీసులను
ప్రశ్నించిన సుప్రీంకోర్టు
మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. వారు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవేనని పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ, అందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ మహిళా భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఏడుగురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ డివై చండ్రచూడ్ ధర్మాసనం ముందు రెజ్లర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 'వీరు మహిళా రెజ్లర్లు. మైనర్‌తో సహా ఏడుగురున్నారు. కమిటీ నివేదిక ఉంది. దానిని బహిర్గతం చేయలేదు. ఎంపీపై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేయలేదు' అని తెలిపారు. దీనికి సీజేఐ డివై చంద్రచూడ్ స్పందించారు. కేసు పత్రాలను తమకు చూపించాలనీ తెలిపారు.
కపిల్ సిబల్ తన వాదనలు కొనసాగిస్తూ బ్రిజ్ భూషన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని, దయచేసి మైనర్ చేసిన చివరి ఫిర్యాదు చూడాలని కోరారు. 'లైంగిక వేధింపుల ఆరోపణలను నిరూపించడానికి వీడియో రికార్డింగ్‌లు ఉన్నాయి. బాధితులైన ఏడుగురు మహిళా రెజ్లర్లు వేధింపులకు గురైనప్పుడు వారిలో ఒకరి వయస్సు 16 ఏండ్లు. ఆమె బంగారు పతకాన్ని గెలుచుకుంది' అని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా.. బ్రిజ్ భూషణ్ పై పోలీసులు కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఇలాంటి నేరంలో కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయనందుకు పోలీసులనూ ప్రాసిక్యూట్ చేయవచ్చని అన్నారు. దీనిపై శుక్రవారం (ఏప్రిల్ 28) విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. అంతేగాక, ఈ కేసులో ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు జ్యుడిషియల్ రికార్డుల నుంచి ఆ ఏడుగురు రెజ్లర్ల పేర్లను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన రెజ్లర్లు, వారిపై లైంగిక వేధింపులు జరిగినట్టు పిటిషన్లో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఈ అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొంది.
మూడో రోజుకు చేరుకున్న రెజ్లర్ల ఆందోళన
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు జంతర్ మంతర్‌లో చేపట్టిన ఆందోళన మంగళవారం మూడో రోజూ కొనసాగింది. వినేష్ ఫోగట్, రవి దహియా, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శివ శర్మతో పాటు ప్రతినిధులు ఆందోళన వద్దకు చేరుకొని నిరసన తెలిపిన క్రీడాకారులతో చర్చించారు. 'నేను రెజ్లర్లను కలవడానికి, వారి మాటలు వినడానికి వచ్చాను. డిమాండ్‌పై నేను ఏమీ చెప్పలేను' అని ఎస్ఏఐ అధికారి విలేకరులతో అన్నారు. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ (ఎస్ఎస్సిబీ) దాని అథ్లెట్లు, కోచ్‌లందరినీ రెజ్లర్ల నిరసనలో భాగస్వామ్యం కాకుండా నిషేధించింది.
రెజ్లర్లకు సంపూర్ణ మద్దతు : బృందాకరత్
ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అన్నారు. బృందా కరత్, ఐద్వా నేతలు జగ్మతి సంఘ్వాన్, ఆశా శర్మ, మైమూనా మొల్లా, సీపీఐ(ఎం) ఢిల్లీ నేత రాజీవ్ కున్వర్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం చేస్తున్నదనీ, అన్ని స్థాయిల్లో జరిగే వేధింపులపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. వేధింపులకు పాల్పడిన వారిని బీజేపీ కాపాడుతుందని విమర్శించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఈ ధైర్యవంతులైన మల్లయోధులకు ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ తన పూర్తి మద్దతును తెలియజేశాయి. హన్నన్ మొల్లా, కృష్ణ ప్రసాద్ (ఏఐకేఎస్), ఎఆర్ సింధు (సీఐటీయు), విక్రమ్ సింగ్ (ఏఐఏడబ్ల్యూయూ) మయూఖ్ బిస్వాస్ (ఎస్ఎఫ్ఐ), హిమగరాజ్ భట్టాచార్య, ఎంపీ ఏఏ రహీమ్ (డీవైఎఫ్ఐ) తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
రేపు దేశవ్యాప్త నిరసన
పోరాడుతున్న మల్లయోధులకు న్యాయం కోసం రేపు (ఏప్రిల్ 27న) దేశవ్యాప్త నిరసనకు ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఐదు సంఘాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. అంతర్జాతీయంగా పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెడుతున్న ఒలింపిక్ పతక విజేతలతో పాటు అగ్రశ్రేణి క్రీడాకారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ''బేటీ బచావో బేటీ పడావో'' అంటూ సంబరాలు చేసుకుంటూనే, మరోవైపు ఈ దారుణమైన నేరంలో నిందితుడైన బీజేపీ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బ్రిజ్ భూషణ్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.