Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలిట్‌బ్యూరో సంతాపం
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు కామ్రేడ్ మృదుల్ డే సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 76సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన కేన్సర్‌తో పోరాడుతున్నారు. అవిభక్త బెంగాల్లో చట్టగ్రామ్లో జన్మించిన కామ్రేడ్ మృదుల్ డే కాలేజీ విద్యార్ధిగా వున్నపుడే క్రియాశీలంగా విద్యార్ధి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీలో చేరారు. 1960, 1970 ప్రారంభ సమయంలో పోలీసుల అత్యాచారాలకు వ్యతిరేకం గా ఆయన సాహసోపేత పోరాటం చేశారు. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చారు. కొంతకాలం పాటు డార్జిలింగ్ జిల్లా నుండి ఆయనను బహిష్క రించారు కూడా. అనంతరం మృదుల్ కోల్‌కతాకు తరలివెళ్ళారు. అక్కడ పార్టీ హౌల్టైమర్గా పనిచేశారు.
పార్టీ దినపత్రిక గణశక్తిలో చేరారు. సాయంకాలం దినపత్రికగా వున్న గణశక్తిని దినపత్రికగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. సవివరమైన కథనంతో నైపుణ్యం కలిగిన విలేకరిగా ఆయన దీర్ఘకాలం పాటు గణశక్తికి చీఫ్ రిపోర్టర్‌గా చేశారు. 1985లో పార్టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు. 2001లో రాష్ట్ర కార్యదిర్శవర్గ సభ్యుడయ్యారు. 2008లో కోయంబత్తూరు మహాసభల్లో పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ఆ పదవిలో 2022 వరకు కొనసాగారు. పుస్తక పఠనం పట్ల విపరీతమైన ఆసక్తి కలిగిన మృదుల్ డే పార్టీ రాజకీయ చైతన్యం కోసం వేసిన అనేక కరపత్రాలను రూపొందించారు. చాలా పుస్తకాలు కూడా రాశారు. ఆయన మృతికి పార్టీ పొలిట్‌బ్యూరో తీవ్ర విచారా న్ని వ్యక్తం చేసింది. ఆయన భార్య స్వప్న, ఇతర కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియచేసింది.