Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాన్ని సవరించేందుకు ఆసక్తిగా ఉన్నాం
- పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు సుప్రీంకు వివరిస్తాం
- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
- వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం!
- ఆగస్టు రెండో వారానికి కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : బ్రిటిష్ కాలం (152 ఏండ్ల) నాటి రాజద్రోహ చట్టాన్ని పున్ణపరిశీలించడంపై సంప్రదింపుల ప్రక్రియ చివర దశలో ఉందని, చట్టాన్ని సవరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్, మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్జి వొంబత్కరే, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీ, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) సహా మొత్తం16 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. దేశద్రోహాన్ని నేరంగా పరిగణించే భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఏను పున్ణపరిశీలించే అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనానికి అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్. వెంకటరమణి తెలిపారు. ఈ ప్రక్రియ చివరి దశలో ఉందనీ, పార్లమెంటుకు వెళ్లే ముందు దానిని న్యాయస్థానానికి చూపుతామని అన్నారు. 'పార్లమెంటు వర్షాకాల సమావేశాల తరువాత ఈ అంశాన్ని తదుపరి విచారణకు దయచేసి వాయిదా వేయండి' అని ఆయన ధర్మాసనాన్ని కోరారు. సవరించిన చట్టాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందువల్ల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తరువాత ఆగస్టు రెండో వారానికి ఈ కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
రాజద్రోహం చట్టాన్ని నిలుపుదల చేస్తూ 2022 మే 11న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ 124ఏ ప్రకారం రాజద్రోహ నేరానికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ కసరత్తు పూర్తియ్యే వరకు ఈ నిబంధన కింద పెండింగ్‌లో ఉన్న అన్ని విచారణల దర్యాప్తు కొనసాగించొద్దని, బలవంతపు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం దేశద్రోహ కేసుల్లో అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లల్లో ఉన్న చాలా మంది వ్యక్తులకు వివిధ కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ చట్టాన్ని పున్ణ పరిశీలించేందుకు మరింత గడువు కావాలని కేంద్రం గతేడాది అక్టోబర్ 31న కోరింది. సవరించిన చట్టాన్ని వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్వాతంత్రానికి పూర్వం, మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్‌తో సహా స్వాతంత్ర సమరయోధులపై ఈ నిబంధన బ్రిటిష్ వారు ప్రయోగించారు. ఇటీవలి కాలంలో రచయిత్రి అరుంధతీ రారు, విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖలీద్, జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్లతో దేశంలో రాజద్రోహం కేసుల సంఖ్య పెరుగుతున్నది.