Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కార్మికుల హక్కుల హననం
- 8 గంటల పని విధానం రద్దుకు చట్టాలు
- వీటికి వ్యతిరేకంగా కార్మికుల ఐక్య పోరాటం : మేడే సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : కార్మికుల ఐక్య పోరాటాల బలోపేతంతోనే సంక్షోభాలకు అడ్డుకట్ట వేయగలమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను, ఎనిమిది గంటల పని దినాన్ని తిరస్కరించడానికి తాజాగా దాడులు జరుగుతున్నాయనీ, ఈ దాడులను ప్రతిఘటించాలనీ, తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఎదురుదాడికి పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక వర్గానికి మే డే శుభాకాంక్షలు, సంఘీభావం తెలిపారు. మేడే విశిష్టత, చారిత్రాత్మక అంశాలను వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వ్యవస్థలు ప్రజలను దోపిడీ చేసి, లాభాలను దండుకుంటున్నాయని అన్నారు. ఈ వ్యవస్థలు సామాన్య ప్రజల జీవితాలు చిన్నాభిన్నం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల జీవన ప్రమాణాలు మరింత దుర్భరంగా తయారయ్యాయని వివరించారు. ప్రపంచం సంకట స్థితిలో ఉందనీ, ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం కూడా నెలకొందని పేర్కొన్నారు. పోరాటాల ద్వారా తప్పితే వీటిని అడ్డుకోలేమని అన్నారు. ప్రపంచంలో నెలకొన్న సంకటాలను అంతం చేయడానికి కార్మికులంతా ఐక్యంగా పోరాడాలనీ, కార్మికుల పోరాట ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ముఖ్యంగా అభివృద్ధిచెందిన దేశాల్లో కార్మికులు, కర్షకులు, కష్టజీవుల పోరాటాలు పెరిగాయని అన్నారు.
దేశంలో స్వాతంత్రం రాకముందు కార్మికుల రక్షణ కోసం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి, కార్మికుల హక్కులను హననం చేస్తున్నదని విమర్శించారు. ఎనిమిది గంటల పని దినం కోసమే కార్మిక దినోత్సవం ఏర్పడిందనీ, కానీ ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో చాలా రాష్ట్రాల్లో ఎనిమిది గంటల పని దినం అమలు కావటం లేదని విమర్శించారు. ఎనిమిది గంటల పనికి బదులు పది గంటలు, 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారన్నారు. అందుకోసం చాలా రాష్ట్రాలు చట్టాలు చేశాయనీ, చట్టాల రూపంలోనే ఈ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు పని చేస్తున్నాయని విమర్శించారు. ఈ మార్పులు, చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులతో కలిసి పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల సంపద లూటీ అవుతున్నదని, ఆ లూటీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేయాలని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్మికులు, రైతుల ఆందోళనలు జరుగుతున్నాయనీ, వీటిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటాల్లో యువత, విద్యార్థులు, మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ పోరాటాలకు మద్దతుగా సీపీఐ(ఎం) పున్ణసంకల్పించిందని అంటూ ''ప్రపంచ కార్మికులారా ఏకంకండి. విప్లవం వర్ధిల్లాలి'' అంటూ నినదించారు. అంతర్జాతీయ పాటతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, సుభాషిణి అలీ, సీఐటీయూ అధ్యక్షురాలు కె.హేమలత, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్, అరుణ్ కుమార్, విక్రమ్ సింగ్, అవదేశ్ కుమార్, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు, మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు హన్నన్ మొల్లా తదితరులు పాల్గొన్నారు.